
Gold Investment: భారతీయులకు బంగారానికి మధ్య ఉన్న సంబంధం అస్సలు విడతీయలేనిది. అనేక శతాబ్ధాలుగా ఇది సాంప్రదాయంలో మమేకమై వస్తోంది. ఇంట్లో మహిళలు తాము దాచుకున్న కొద్ది మెుత్తంతో కాసు బంగారం అయినా కొనుక్కోవాలని అనుకుంటుంటారు. దీనికి తోడు ఇంట్రో చిన్నదైనా లేక పెద్దదైనా ఎలాంటి ఫంక్షన్ ఉన్నా గోల్డ్ ఖచ్చితంగా కొంటుంటాయి భారతీయ కుటుంబాలు. అయితే ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతున్న బంగారం రేట్లు సామాన్యులకు ఊపిరి సలపనివ్వటం లేదు. ఒకవేళ రేట్లు తగ్గితే చాలా మంది షాపింగ్ చేయాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బంగారంలో పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
బంగారు ఆభరణాలు:
దేశంలో సాధారణంగా ఎక్కువమంది పెట్టుబడి చేసేది బంగారు ఆభరణాల రూపంలోనే. ఇవి జీవితకాలపు జ్ఞాపకాలతో పాటు ఆర్థిక భద్రతనూ ఇస్తాయి. అయితే ఇవి కొనుగోలు చేసే సమయంలో బంగారం ధరను తెలుసుకోవడం కీలకం. అంతేకాకుండా తయారీ ఖర్చులు, జీఎస్టీ వల్ల మళ్లీ అమ్మే సమయంలో కొద్దిగా నష్టపోవాల్సి ఉంటుంది.
గోల్డ్ కాయిన్స్, బార్‌లు:
తయారీ ఖర్చులు లేకుండా శుద్ధమైన బంగారాన్ని కొనాలనుకునే వారికి నాణేలు, బార్‌లు ఉత్తమమైన ఎంపిక. ఇవి వివిధ బరువుల్లో, అత్యంత స్వచ్ఛత స్థాయిల్లో లభిస్తాయి. బ్యాంకులు, జువెలర్స్ వద్ద వీటిని కొనవచ్చు.
గోల్డ్ ETFలు:
బంగారాన్ని ప్రత్యక్షంగా కొనకుండా.. స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ద్వారా పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గోల్డ్ ETFs అనువైన మార్గం. ఇవి నిజమైన బంగారంతో బ్యాక్ చేయబడి ఉంటాయి. స్టాక్‌ల మాదిరిగానే ట్రేడ్ చేయవచ్చు.
డిజిటల్ గోల్డ్:
సాంకేతికతను ఇష్టపడే వారికి డిజిటల్ గోల్డ్ ఒక ఉత్తమ పరిష్కారం. కేవలం రూ.10 నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. దొంగతనం భయం లేదా తయారీ ఖర్చులు ఉండవు. అయితే జీఎస్టీ ఉంటుంది. కొనే రేటు కంటే అమ్మే రేటు తక్కువగా ఉంటుందని మర్చిపోవద్దు.
సావరిన్ గోల్డ్ బాండ్లు (SGBs):
భౌతిక బంగారం కాకుండా ప్రభుత్వ హామీతో బంగారంపై పెట్టుబడి పెట్టే పద్ధతి SGBs(సావరిన్ గోల్డ్ బాండ్లు). ఇవి రిజర్వ్ బ్యాంక్ ద్వారా జారీ అవుతాయి. వీటిపై ప్రతి సంవత్సరం 2.5% వడ్డీతో పాటు బంగారం ధర పెరిగితే అదనపు లాభం కూడా లభిస్తుంది. గడువు వరకు ఉంచితే పన్ను లాభాలు ఉంటాయి. ప్రస్తుతం కొత్త ఇష్యూ అందుబాటులో లేకపోయినా, సెకండరీ మార్కెట్‌లో కొనుగోలు చేసే అవకాశం ఉంది.