రేషన్ బియ్యం రీసైక్లింగ్ హబ్ గా కోదాడ..గుట్టుగా సరిహద్దు దాటుతున్న బియ్యం

రేషన్ బియ్యం రీసైక్లింగ్ హబ్ గా కోదాడ..గుట్టుగా సరిహద్దు దాటుతున్న బియ్యం

సూర్యాపేట/ కోదాడ, వెలుగు:  సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం రేషన్ బియ్యం రీసైక్లింగ్ కు హబ్ గా మారింది. ఇక్కడ కొందరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని  వివిధ మార్గాల ద్వారా తక్కువ ధరకు సేకరించి వాటిని ఆంధ్రప్రదేశ్ కు తరలించి ఎక్కువ ధరకు అమ్ముతూ భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ దందాలో కొందరు అధికార పార్టీ నాయకులు, ప్రముఖుల పాత్ర ఉన్నట్లు సమాచారం. వీరు కొందరు సివిల్ సప్లయ్ అధికారులు, పోలీసులతో కుమ్మక్కై భారీ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  ఇక్కడ నుంచి ఏపీలోని కాకినాడకు తరలించిన బియ్యం లారీని స్థానిక పోలీసులు వెనక్కి తీసుకొచ్చారు. ఈ ఘటన రెండు వారాల కింద జరిగింది.  

ఈనెల 7న అనంతగిరి మండలం అమీనాబాద్ నుంచి ఏపీలోని జగ్గయ్య పేటకు అక్రమంగా పీడీఎస్​బియ్యాన్ని తరలిస్తుండగా కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. సైదా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. కోదాడ నియోజకవర్గంలోని డీలర్ల నుంచి పీడీఎస్​ బియ్యం కొనుగోలు చేసి అక్కడి నుంచి జగ్గయ్య పేటలో పిచ్చయ్య అనే వ్యక్తికి అమ్ముతున్నారు. అక్కడి నుంచి కాకినాడకు తరలించి కాకినాడ పోర్ట్ ద్వారా బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు ఎక్స్ పోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇటీవల కోదాడ నుంచి కాకినాడ తరలించిన 13టన్నుల పీడీ ‌‌‌‌ఎస్ బియ్యం లారీని పోలీసులు వెనక్కి తీసుకొచ్చి సీజ్ చేశారు. అనంతగిరి మండలానికి చెందిన ఒక వ్యక్తి తో పాటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో మొత్తం ఎనిమిది మందిని గుర్తించాగా కేవలం నలుగురిపై మాత్రమే కేసు నమోదు చేసి అధికార పార్టీకి చెందిన కొంతమంది కీలక నేతలను కేసు నుంచి తప్పించినట్లు సమాచారం. 

గోడౌన్​ నుంచే పక్కదారి!

ఇటీవల రేషన్ బియ్యం నిల్వ చేస్తున్న గోడౌన్ల నుంచే పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. కోదాడ డివిజన్ లో డీలర్ల సంఘంలో కీలక పాత్ర పోషిస్తున్న ఒక అధికార పార్టీ నాయకుడు ఈ దందా వెనక ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు డీలర్లకు అధిక ధర ఇస్తానని చెప్పి వారికి కేటాయించిన బియ్యాన్ని నేరుగా బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని సమాచారం. ఇలా వివిధ మార్గాలలో రేషన్ బియ్యాన్ని రాత్రి వేళల్లో సరిహద్దు అవతల ఉన్న వ్యాపారులకు చేరవేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 

కేసు నమోదు చేశాం 

కోదాడ లో పీడీఎస్​బియ్యం తరలిస్తున్న వారిని పట్టుకొని కేస్ నమోదు చేసి లారీని సీజ్ చేశాం. నలుగురు పై కేసు నమోదు చేశాం. ఇంకా ఎంక్వైరీ కొనసాగుతోంది. త్వరలో కేసు వివరాలను వెల్లడిస్తాం. ఈ తరహా దందాకు పాల్పడితే వారు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకుంటాం. 

‌‌‌‌-  వెంకటేశ్వరరెడ్డి, డీఎస్పీ, కోదాడ