- రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
హైదరాబాద్, వెలుగు: అత్యంత విషపూరితమైన ‘పారాక్వాట్’ గడ్డి మందును నిషేధిస్తూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానంపై రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మందు కారణంగా రాష్ట్రంలో వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పారాక్వాట్‌ను రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా నిషేధించేలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కమిషన్ కోరింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), పలు రైతు సంఘాలు ఈ ప్రాణాంతక కలుపు మందును నిషేధించాలని కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా, ముఖ్యంగా అమెజాన్ వంటి సంస్థల ద్వారా పారాక్వాట్ విక్రయాలు ఇంకా కొనసాగుతుండటంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేయాలని, లైసెన్స్ వ్యవస్థపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించింది.
