కాళేశ్వరం తప్పిదాలపై చర్చకు సిద్ధమా? : కోదండరాం

కాళేశ్వరం తప్పిదాలపై చర్చకు సిద్ధమా? : కోదండరాం
  • బీఆర్ఎస్​కు​ కోదండరాం సవాల్​
  • బీఆర్‌‌ఎస్‌‌ వైఖరి.. దొంగే దొంగ అన్నట్టుంది
  • పిల్లర్లు కాదు.. మూడు కోట్ల  ప్రజల భవిష్యత్తు కుంగిపోయింది
  • ఊరూరూ తిరిగి బీఆర్ఎస్ బండారాన్ని బయటపెడతామని హెచ్చరిక

హైదరాబాద్‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దొంగే దొంగ అన్నట్టుగా బీఆర్ఎస్ వైఖరి ఉందని టీజేఎస్‌ పార్టీ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. కుంగిపోయింది మూడు పిల్లర్లే కదా అని ఆ పార్టీ నేతలు వితండవాదం చేస్తున్నారని.. కానీ, మూడు కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు కుంగిపోయిందని ఆయన అన్నారు. 

బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డకు పోవడం అవినీతి చేసిన వాళ్లే అద్దంలో ముఖం చూసుకున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు, అవినీతి, కాగ్ ఇచ్చిన నివేదికలపై శుక్రవారం ఆయన నాంపల్లిలోని టీజేఎస్​ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పిదాలపై చర్చకు సిద్ధమా? అని బీఆర్ఎస్ కు కోదండరాం సవాల్ విసిరారు. ప్రణాళిక, నిర్వహణ, నాణ్యత, డిజైన్ లోపం వల్లే పిల్లర్లు కుంగిపోయాయని తెలిపారు. ఇంజినీర్లతో సంబంధం లేకుండా కేసీఆర్ తరచూ డిజైన్లు మార్చుకుంటూ పోయారని మండిపడ్డారు. 

మార్చిన డిజైన్లకు అనుమతులు కూడా తీసుకోలేదన్నారు. బ్యారేజీ నిర్మాణానికి మేడిగడ్డ సరైంది కాదని కేంద్ర జల సంఘం చెప్పిందని.. ఆ హెచ్చరికను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. పంప్ హౌస్ లు మునుగుతాయని హెచ్చరించినా పట్టించుకోవడం లేదని చెప్పారు. డీపీఆర్‌ను ఆమోదించకుండానే పనులు ప్రారంభించారని అన్నారు. 

ఇది మూడు పిల్లర్లకు సంబంధించింది కాదని, స్లాబ్ ప్రభావం మిగతా పిల్లర్లు మీద ఉంటుందని వెల్లడించారు. 18 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేందుకు నిర్మించిన ప్రాజెక్ట్.. కేవలం 90 వేల ఎకరాలకే పరిమితమైందన్నారు. ప్రాజెక్టుతో ఒక ఎకరానికి నీరు ఇచ్చేందుకు రూ.46 వేల  ఖర్చు అవుతుందని, కరెంటు బిల్లులకే ఏడాదికి రూ.10వేల కోట్లు అవుతుందన్నారు. 

ఫామ్ హౌస్ కు ప్రత్యేకంగా నీరు రావడం కోసం రూ.70 కోట్లతో కేసీఆర్​కాలువను నిర్మించుకున్నారని విమర్శించారు. సొంత ప్రయోజనాల కోసమే ఇలాంటి పనులు చేశారని ఆరోపించారు. పూర్తి స్థాయిలో నిర్మించకుండానే బీఆర్‌ఎస్‌  ప్రభుత్వం చేతులు దులుపుకొందని, దీంతో ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభానికి కారణమైందని విమర్శించారు. 

ఈ నెల 10న నీళ్లు,  నిధులపై బహిరంగ చర్చ..

కేసీఆర్ పాలన లాంటి దుర్మార్గపు పాలనను ఎప్పుడూ చూడలేదని, భవిష్యత్తులో కూడా చూడలేమని కోదండరాం అన్నారు. బంగారు తెలంగాణను సంక్షోభంలోకి నెట్టేశారని మండిపడ్డారు. కాళేశ్వం కామధేనువు ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలన్నారు. అది కామధేనువు కాదని, తెలంగాణ ప్రజల పాలిట గుదిబండ అని విమర్శించారు. ఊరూరూ తిరిగి బీఆర్ఎస్ బండారాన్ని బట్టబయలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ నెల 10న నీళ్లు, నిధులపై బహిరంగ చర్చకు టీజేఎస్‌ ప్లాన్‌ చేస్తోందని కోదండరాం చెప్పారు.