ఆధ్యాత్మిక గురువుగానే సింహయాజీని కలిశాను: కోదండరామ్ 

ఆధ్యాత్మిక గురువుగానే సింహయాజీని కలిశాను: కోదండరామ్ 

ఫామ్ హౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సింహయాజీతో ఉన్న సంబంధాలపై  టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ క్లారిటీ ఇచ్చారు. ఆరు నెలల కిందట తాను కలిసింది వాస్తవమేనని అన్నారు. ఆయనను కలవడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని వివరణ ఇచ్చారు. తిరుపతి నుండి వచ్చిన గురువుగా సింహయాజీని పరిచయం చేశారని చెప్పారు. ఆధ్యాత్మిక గురువుగానే సింహయాజీని కలిశానని కోదండరామ్‌ స్పష్టం చేశారు. 

ఫాం హౌస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్ లకు షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు నిందితులు రూ.3లక్షల చొప్పున పూచీకత్తుతో పాటు రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. నిందితులు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.  నిందితులంతా పాస్ పోర్టులను సిట్ అధికారులకు అప్పగించడంతో పాటు సాక్ష్యులను ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దని షరతు విధించింది.

ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్ 33 రోజులుగా చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఈ క్రమంలోనే  బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు సుప్రీంకోర్టు ఉత్తర్వులను నిందితుల తరఫు న్యాయవాది హైకోర్టు ముందుంచారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు చెప్పారు.