
ఇంటర్ చావులపై మాట్లాడవేం
పదే పదే తప్పులు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
జోలె పట్టుకుని అడుక్కుని బాధితులకు సాయం అందిస్తాం
గవర్నర్ ను వెళ్లి చందా అడుగుతాం
తెలంగాణ ఉద్యమం కొనసాగిస్తాం
ఉద్యమకారులు నేరస్తులయ్యారు.. ద్రోహులు నీ పక్కన కూర్చున్నారు
ఇంటర్ సెమినార్ లో ప్రభుత్వంపై కోదండరామ్ విమర్శలు
హైదరాబాద్ : ఇంటర్ బోర్డు వైఫల్యాలపై అఖిల పక్షం ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో సెమినార్ నిర్వహించారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, పలు పార్టీల నాయకులు, ఇంటర్మీడియట్ ఫలితాల బాధిత కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వంలో ఉండి కూడా ముఖ్యమంత్రి స్పందించలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ విమర్శించారు. చదువురాక చనిపోయారు అని అనడం కరెక్ట్ కాదన్నారు. విద్యార్థులు చనిపోకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మానవ తప్పిదాల వల్ల జరిగిన ఈ తప్పిదం మళ్ళీ మళ్ళీ జరగకుండా ప్రభుత్వం చూడాలన్నారు. 26 మంది చావుకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబాలకు సాయంపై.. ప్రభుత్వానికి డెడ్ లైన్ పెడతామన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోకపోతే .. అఖిల పక్షం ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి సనత్ నగర్ వరకు జోలె పట్టుకుని అడుక్కుంటూ బయలుదేరుతాం అన్నారు. ఎన్ని పైసలు వస్తే అన్ని పైసలు బాధిత కుటుంబాలకు ఇస్తామని చెప్పారు. గవర్నర్ దగ్గరికి వెళ్లి చందా అడుగుతాం అన్నారు. త్రిసభ్య కమిటీ ఇచ్చిన 75పేజీల రిపోర్ట్ బయటపెట్టాలని.. దాని ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కోదండరామ్.
“ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొన్నవారు ఇపుడు నేరస్థులు అయ్యారు. తెలంగాణను అడ్డుకున్న వారిని నీ పక్కన కూర్చోపెట్టుకున్నావు. ఇంటర్ ఆత్మహత్యల ఘటనలపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలి.
మార్కుల కోసం ఒత్తిడి తెస్తే కళాశాలలో చనిపోయిన విద్యార్థులు ఉన్నారు. ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ ఘటనపై రాష్ట్రపతిని కలుస్తాం.” అన్నారు