తెలంగాణ దిక్సూచిలో టీఎన్జీవోస్ ఒకటి : కోదండరాం

తెలంగాణ దిక్సూచిలో టీఎన్జీవోస్ ఒకటి :  కోదండరాం
  • పదేండ్లుగా ఉద్యోగులకు గౌరవం లేకుండా చేసిన్రు   

శామీర్​పేట, వెలుగు: తెలంగాణ సమాజానికి దిక్సూచిగా పనిచేసిన రెండు శక్తుల్లో ఒకటి టీఎన్జీవోస్, మరొకటి ఉస్మానియా యూనివర్సిటీ అని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. బుధవారం శామీర్​పేటలోని నల్సార్ లా వర్సిటీ ఆడిటోరియంలో టీఎన్జీవోస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు బి.రవి ప్రకాశ్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్​కు ఆయన చీఫ్​గెస్టుగా హాజరై మాట్లాడారు. తెలంగాణ వచ్చాక గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించి, జిల్లాలు.. పనిభారం పెంచారని వివరించారు. ఉద్యోగులకు ఆత్మగౌరవం లేకుండా చేశారని, ఒకవిధంగా శ్రమ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాకు వెళ్లిన స్వరాష్ట్ర ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నా పదేండ్లుగా గత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందన్నారు. అప్పులపాలైన రాష్ట్రంలో ఇప్పుడే కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మంచి పాత్ర పోషించే అవకాశం తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీవోస్)కు మాత్రమే ఉందన్నారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరాం, నల్సార్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు టీఎన్జీవోస్ –2024 డైరీ, క్యాలెండర్​ను ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు ఎం. జగదీశ్వర్, టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. భరత్ కుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.