2 లక్షల ఉద్యోగాల భర్తీ నిరూపిస్తే ముక్కు నేలకు రాస్త : కోదండరాం

2 లక్షల ఉద్యోగాల భర్తీ నిరూపిస్తే ముక్కు నేలకు రాస్త :  కోదండరాం
  • 2 లక్షల ఉద్యోగాల భర్తీ నిరూపిస్తే ముక్కు నేలకు రాస్త
  • కేటీఆర్​వి తప్పుడు లెక్కలు: కోదండరాం
  • ప్రవళిక కుటుంబాన్ని ఆదుకోవాలి
  • నిరుద్యోగ జేఏసీ సమావేశంలో టీజేఎస్​ చీఫ్​ 

హైదరాబాద్, వెలుగు : మంత్రి కేటీఆర్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామంటూ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని, ఈ విషయంపై ఆయన చర్చకు రావాలని టీజేఎస్​ చీఫ్ కోదండరాం సవాల్​ విసిరారు. ఒక వేళ తాను చెప్పింది అబద్ధమని తేలితే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగాల భర్తీపై శనివారం సోమాజీగూడ ప్రెస్​ క్లబ్​కు చర్చకు రావాలని చాలెంజ్ చేశారు. హైదరాబాద్​లోని సోమాజీగూడ ప్రెస్​ క్లబ్​లో మంగళవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ప్రవళిక మృతిపై కేటీఆర్ తప్పుడు వ్యాఖ్యలను ఖండిస్తూ సమావేశం నిర్వహించారు. దీనికి కోదండరాం, ఏఐసీసీ అధికార ప్రతినిధి డాలీ శర్మ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. ప్రభుత్వం తనను తాను కాపాడుకోవడానికి ప్రవళికపై తప్పడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. ప్రవళిక కుటుంబాన్ని ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో బంధులు, పెన్షన్లు తప్ప నిరుద్యోగుల ఊసేలేదని మండిపడ్డారు. ప్రభుత్వం సక్రమంగా పరీక్షలు నిర్వహిస్తే, కోర్టు కేసులెందుకు అవుతాయని ప్రశ్నించారు. టీఎస్​పీఎస్సీని రద్దుచేసి కొత్త బోర్డును తీసుకురావాలని కోరినా ప్రభుత్వం స్పందిచండం లేదని మండిపడ్డారు. 

ఆత్మహత్యలొద్దు, ఆత్మధైర్యంతో ఉండండి అని నిరుద్యోగులకు సూచించారు. ఎన్నికల కోడ్ పేరుతో ఈ సమావేశాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలని చూసిందన్నారు. నిజాలు తెలుసుకోకుండా ప్రవళిక గ్రూప్స్ రాయలేదని ఎలా మాట్లాడుతారని డాలీశర్మ ప్రశ్నించారు. ప్రవళిక ఇంటికి వెళ్లి నిజాలు తెలుసుకున్నానని, ఆమె వ్యక్తిత్వాన్ని దిగజార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం సరికాదన్నారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం ఫేయిల్ అయిందని, కేసీఆర్ ఒక ఫెయిల్యూర్ సీఎం అని విమర్శించారు. టీఎస్​పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిపై విచారణ జరపాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో రియాజ్, సజయ, ఝాన్సీ, ప్రొ.వినాయక్​రెడ్డి, బాలలక్ష్మి, చుక్కా లత, ఓయూ విద్యార్థి నాయకుడు రమేశ్, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.