మరో ఉద్యమానికి రెడీ కావాలె.. ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిందే: కోదండరాం

మరో ఉద్యమానికి రెడీ కావాలె.. ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిందే: కోదండరాం
  • 21, 22న ‘తెలంగాణ బచావో యాత్ర’
  • జయశంకర్ సార్ గ్రామం అక్కంపేట నుంచి మేడారం వరకు యాత్ర
  • వడ్ల తరుగు దోపిడీలో ఎమ్మెల్యేలే ఉన్నారని కామెంట్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్  ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన టైమ్  వచ్చిందని టీజేఎస్  చీఫ్  కోదండరాం అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న నేతలంతా ఐక్యమై, మరో ఉద్యమానికి రెడీ కావాలని ఆయన కోరారు. ఆదివారం నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఇటీవల సూర్యాపేటలో జరిగిన పార్టీ మూడో  ప్లీనరీలో అధ్యక్షుడిగా కోదండరాంను తిరిగి ఎన్నుకున్న తరువాత తొలిసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో కోదండరాం మాట్లాడారు. ఈనెల 21, 22న ‘తెలంగాణ బచావో యాత్ర’ చేపడుతున్నామని ఆయన ప్రకటించారు. ప్రొఫెసర్  జయశంకర్  సార్  గ్రామం అయిన అక్కంపేట నుంచి మేడారం వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు.

ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలపై చర్చిస్తామన్నారు. టీజేఎస్ ను ఏ పార్టీలోనూ విలీనం చేయబోమని , స్వతంత్రంగా ఉంటూనే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘‘పోడు, ధరణి సమస్యలపై అన్ని పార్టీలు ఐక్యం కావాలి. వచ్చే నెల 15లోగా ప్రజల సమస్యలను పరిష్కరించాలి. ధరణి లో లోపాలు సరిచేయాలి. 20 రకాల సమస్యలను రైతులు ఎదుర్కుంటున్నరు. ప్రజల సమస్యలపై మండల స్థాయిలో సెమినార్లు ఏర్పాటు చేస్తం. ఇక రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో వడ్డీ పెరిగింది. పంట నష్టం ఎకరాకు రూ.10 వేలు ఇస్తారని ప్రకటించారు. ఇంకా ఆ పరిహారం చెల్లించలేదు. వడ్ల కొనుగోలులో తరుగు పేరుతో దోపిడీ చేసింది ఎమ్మెల్యేలే. ఆ దోపిడీలో ఎమ్మెల్యేలు వాటాదారులుగా మారారు” అని కోదండరాం అన్నారు. క్వింటాల్ కు 7 నుంచి 10 కిలోలు తరుగు తీస్తే రైతులు ఎట్ల బతుకుతారని ఆయన ప్రశ్నించారు. ట్రిపుల్ ఆర్  రియల్  ఎస్టేట్  వ్యాపారుల కోసమే అని ఆయన ఆరోపించారు. పక్కా ఇండ్లు, పెన్షన్లపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్  చేశారు. కాగా, టీజేఎస్ పార్టీకి కొత్త కమిటీని నియమించారు. నలుగురికి ఉపాధ్యక్షులుగా అవకాశం ఇచ్చారు.