- ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్‌పై గ్రాండ్ విక్టరీ
- కింగ్ కోహ్లీ క్లాసికల్ ఇన్నింగ్స్
- రాణించిన ఆర్సీబీ బౌలర్లు
అహ్మదాబాద్: ఐపీఎల్–19లో సమవుజ్జీల సమరం కాస్త ఏకపక్షమైంది. లీగ్ దశలో అత్యుత్తమ ప్రదర్శన చూపెట్టిన రెండు జట్ల మధ్య జరిగిన మెగా ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైచేయి సాధించింది. ఛేజ్ మాస్టర్, కింగ్ విరాట్ కోహ్లీ (42 బాల్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 75 నాటౌట్) క్లాసికల్ ఇన్నింగ్స్‌కు తోడు బౌలర్లందరూ సమష్టిగా రాణించడంతో.. ఆదివారం జరిగిన టైటిల్ ఫైట్‌లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై గెలిచి రెండోసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. టాస్ ఓడిన గుజరాత్ 20 ఓవర్లలో 155/8 స్కోరు చేసింది. వాషింగ్టన్ సుందర్ (37 బాల్స్‌లో 5 ఫోర్లతో 50 నాటౌట్) టాప్ స్కోరర్. ఛేజింగ్‌లో బెంగళూరు 18వ ఓవర్లలో 161/5 స్కోరు చేసి నెగ్గింది. వెంకటేశ్ అయ్యర్ (16 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) మెరుగ్గా ఆడాడు. కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, వైభవ్ సూర్యవంశీకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
బౌలర్లు అదుర్స్
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ను కట్టడి చేయడంలో బెంగళూరు బౌలర్లు బాగా సక్సెస్ అయ్యారు. స్టార్టింగ్‌లోనే రెండు ఫోర్లు కొట్టిన శుభ్‌మన్ గిల్ (10)ను మూడో ఓవర్‌లో హాజిల్‌వుడ్ (2/37) ఔట్ చేశాడు. గిల్ కొట్టిన షాట్ మిస్ ఫైర్ అయి పటీదార్ చేతుల్లోకి వెళ్లింది. సరిగ్గా ఏడు బాల్స్ తర్వాత భువనేశ్వర్ (2/29) వేసిన బౌన్సర్‌ను ఫుల్ చేయబోయి సుదర్శన్ (12) వికెట్ కీపర్‌కు చిక్కాడు. 26/2తో కష్టాల్లో పడిన జీటీని నిశాంత్ సింధు (20), బట్లర్ (19) ఆదుకునే ప్రయత్నం చేశారు. నిశాంత్ నాలుగు ఫోర్లతో టచ్‌లోకి రావడంతో జీటీ 45/2తో పవర్‌ప్లేను ముగించింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత బెంగళూరు స్పిన్నర్లు క్రునాల్ (1/23), రసిక్ సలామ్ (3/27) రన్స్‌ను నిరోధించారు. దాంతో ఒత్తిడికి లోనైన నిశాంత్ 8వ ఓవర్‌లో రసిక్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. మూడో వికెట్‌కు 29 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. బట్లర్‌తో కలిసి సుందర్ డిఫెన్సివ్ ఆటతీరుతో వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దాంతో గుజరాత్ 63/4తో ఫస్ట్ టెన్ ఓవర్స్‌ను ముగించింది. కానీ రెండు ఎండ్‌ల నుంచి క్రునాల్, రసిక్ సూపర్ బౌలింగ్‌తో జీటీ బ్యాటర్లను ఒత్తిడిలో పడేశారు. ఫలితంగా 13వ ఓవర్‌లో బట్లర్.. క్రునాల్‌కు వికెట్ ఇచ్చాడు. ఈ దశలో సుందర్ నిలకడను చూపినా.. రెండో ఎండ్‌లో వరుస విరామాల్లో వికెట్లు పడ్డాయి. రెండు సిక్స్‌లు బాదిన అర్షద్ ఖాన్ (15).. 15వ ఓవర్‌లో వెనుదిరగడంతో స్కోరు 105/5గా మారింది. సుందర్ బౌండ్రీలతో జోరు చూపెట్టినా.. రాహుల్ తెవాటియా (7), హోల్డర్ (7), రషీద్ ఖాన్ (7) నిరాశపర్చారు. సుందర్ 37 బాల్స్‌లో ఫిఫ్టీ చేసినా.. జీటీ తక్కువ స్కోరుకే పరిమితమైంది.
కోహ్లీ కేక..
చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో వెంకటేశ్ అయ్యర్ మెరుపు ఆరంభాన్నిచ్చాడు. సిరాజ్ (1/36) తొలి ఓవర్‌లో ఐదే రన్స్ ఇచ్చినా.. రబాడ (1/44) వేసిన రెండో ఓవర్‌లో వెంకటేశ్ 4, 6, 4, 4తో 18 రన్స్ రాబట్టాడు. మూడో ఓవర్‌లో కోహ్లీ మూడు ఫోర్లు, తర్వాతి ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్‌తో 32 రన్స్ దంచాడు. ఐదో ఓవర్‌లో సిక్స్ కొట్టిన వెంకటేశ్‌ను సిరాజ్ ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 62 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. మూడు బాల్స్ తర్వాత దేవదత్ పడిక్కల్ (1) కూడా వెనుదిరగడంతో స్కోరు 63/2గా మారింది. కోహ్లీ సిక్స్‌తో పవర్‌ప్లేలో ఆర్సీబీ 70/2 స్కోరు చేసింది. రజత్ పటీదార్ (15).. 6, 4తో హిట్టింగ్ మొదలుపెట్టినా.. 9వ ఓవర్‌లో రషీద్ (2/25) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఐదు బాల్స్ తేడాలో పటీదార్, క్రునాల్ పాండ్యా (1)ను ఔట్ చేసి షాకిచ్చాడు. మూడో వికెట్‌కు 26 రన్స్ జతయ్యాయి. స్కోరు 91/4గా మారింది. పదో ఓవర్‌లో కోహ్లీ 4, టిమ్ డేవిడ్ (24) ఫోర్‌తో స్కోరు 100/4కు చేరింది. తర్వాత కూడా అదే జోరును కొనసాగించిన కోహ్లీ 25 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 6, 4 కొట్టిన డేవిడ్‌ను 14వ ఓవర్‌లో అర్షద్ ఖాన్ (1/32) పెవిలియన్‌కు పంపాడు. జితేష్ శర్మ (11 నాటౌట్) ఫోర్‌తో టచ్‌లోకి రావడంతో స్కోరు 15 ఓవర్లలో 139/5కు పెరిగింది. దాంతో ఆర్సీబీ విజయ సమీకరణం 30 బాల్స్‌లో 17 రన్స్‌గా మారింది. ఈ దశలో కోహ్లీ 4 కొట్టి ఆ తర్వాత ఇచ్చిన క్యాచ్‌ను గిల్ డైవ్ చేసి అందుకున్నాడు. అంతే స్టేడియం ఒక్కసారిగా కోహ్లీ.. కోహ్లీ అంటూ మార్మోగుతున్న వేళ విరాట్ మళ్లీ వెనక్కి వచ్చాడు. రీ ప్లేలో బాల్ నేలకు తగిలినట్లు తేలడంతో బ్యాటింగ్ కంటిన్యూ చేశాడు. చివరకు18వ ఓవర్‌లో కోహ్లీ 4, 6తో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఆకట్టుకున్న ముగింపు వేడుకలు
దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించిన ఐపీఎల్–19 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఇన్నింగ్స్ విరామ సమయంలో సూఫీ గాయకుడు కైలాష్ ఖేర్ ప్రత్యక్ష సంగీత ప్రదర్శనతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. కళాకారుల నృత్య ప్రదర్శనలతో స్టేడియం హోరెత్తింది. కళ్లు మిరుమిట్లు గొలిపే బాణా సంచా వెలుగులు, లేజర్ షోలతో నరేంద్ర మోదీ స్టేడియం తళుక్కుమన్నది. అద్భుతమైన మెగా డ్రోన్ ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు బీసీసీఐ పెద్దలు, ఇతర దేశాల బోర్డు చైర్మన్లు ఈ మ్యాచ్‌ను తిలకించారు.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 155/8 (సుందర్ 50*, రసిక్ సలామ్ 3/27).
బెంగళూరు: 18 ఓవర్లలో 161/5 (కోహ్లీ 75*, వెంకటేశ్ 32, రషీద్ 2/25).
