సూర్యతో బ్యాటింగ్ చేయడం సరదాగా ఉంటుంది

సూర్యతో బ్యాటింగ్ చేయడం సరదాగా ఉంటుంది

మరికాసేపట్లో భారత్ పాక్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుండగా...టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ...సూర్యకుమార్ యాదవ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సూర్యతో బ్యాటింగ్ చేయడం అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అతను క్రీజులో ఉంటే..అవతలి ఎండ్ లో ఉండే బ్యాట్స్మన్ ప్రేక్షక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నాడు. స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

బ్యాటింగ్తో అలరిస్తాడు..
సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బ్యాట్స్ మన్. అతనితో బ్యాటింగ్ చేయడం సరదాగా ఉంటుంది. అతని బ్యాటింగ్తో అందరిని అలరిస్తాడు. క్రీజులోకి వచ్చీరాగానే..బంతి ఎలా వస్తుందని కనుక్కంటాడు. ఆ తర్వాత కొన్ని బంతులు ఆడాక..పిచ్పై అవగాహనకు వస్తాడు. అనంతరం బాదుడు స్టార్ట్ చేస్తాడు. క్రీజులో నేను సూర్య ఉన్నప్పుడు..అతను ఎదురు దాడి చేస్తుంటే..నేను చూస్తూ ఉండిపోతా...అని కోహ్లీ వివరించాడు. ఇక నేను క్రీజులో ఉంటే చాలు..సూర్య మరింతగా చెలరేగుతాడు. జస్ట్ నువు అండగా ఉండన్నా..నేను చెలరేగుతా అని అంటాడు. నేను కూడా సూర్య బ్యాటింగ్ ను ఆస్వాదిస్తా...అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. 

ధోని ప్రోత్సాహం మరవలేనిది..
తన కెరీర్కు ధోని అందించిన సహకారం మరవలేనిదని కోహ్లీ అన్నాడు. ధోని ఇచ్చిన మద్దతు, ప్రోత్సాహం కారణంగానే తాను ఈ స్థాయిలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. తాను ధోనికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నాడు. ధోని తనను అర్థం చేసుకున్న విధానం, తనపై ఉంచిన నమ్మకం గొప్పదని తెలిపాడు. తామిద్దరం బ్యాటింగ్ చేసే సమయంలో ఒకరికి ఒకరం చెప్పుకోకుండా రన్స్ చేసేవాళ్లమన్నాడు.  ఇద్దరం దాదాపు 12 ఏళ్ల పాటు కలిసి బ్యాటింగ్ చేశామని..ఒకటి రెండు సార్లు మాత్రమే అపార్థాలు చోటు చేసుకున్నాయని వివరించాడు. మైదానంతో పాటు..మైదానం బయటా  ఇద్దరి మధ్య నమ్మకం, స్నేహం, విశ్వాసం కొనసాగుతున్నాయని కోహ్లీ వివరించాడు.