కోహ్లీ ఔట్‌‌‌‌..అఫ్గానిస్తాన్‌‌తో వన్డే సిరీస్‌‌కు దూరం

కోహ్లీ ఔట్‌‌‌‌..అఫ్గానిస్తాన్‌‌తో వన్డే సిరీస్‌‌కు దూరం
  •     రేసులో రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌
  •     రోహిత్‌‌ ఆడటంపై సందిగ్ధత

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌‌తో మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొడ కండరాల గాయం కారణంగా స్టార్‌‌ బ్యాటర్‌‌ విరాట్‌‌ కోహ్లీ ఈ సిరీస్‌‌కు దూరమయ్యాడు. ఆదివారం జరిగిన ఐపీఎల్‌‌–19 ఫైనల్ మ్యాచ్‌‌ సందర్భంగా విరాట్‌‌కు ఈ గాయమైనట్లు తెలుస్తోంది. ‘కోహ్లీ మోకాలి కింది భాగంలో ఉండే నరానికి గాయమైంది. దీనివల్ల నొప్పితో ఇబ్బందిపడ్డాడు. ఫైనల్‌‌ తర్వాత నిర్వహించిన  స్కానింగ్‌‌లో ఇది వెల్లడైంది’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కోహ్లీ ప్లేస్‌‌లో రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. శ్రీలంకలో జరగబోయే ముక్కోణపు సిరీస్‌‌ కోసం రుతురాజ్‌‌ను ఇండియా–ఎ జట్టుకు ఎంపిక చేశారు. సెలెక్టర్లు గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇస్తే త్వరలోనే టీమిండియాతో కలవనున్నాడు.

 హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ శర్మ కూడా పూర్తిగా అందుబాటులో ఉంటాడా? లేదా? అన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఐపీఎల్‌‌ టైమ్‌‌లో రోహిత్‌‌ కూడా తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడ్డాడు. ‘రోహిత్‌‌ ఫిట్‌‌నెస్‌‌ను కూడా సమీక్షించాల్సి ఉంది. వన్డే సిరీస్‌‌ ప్రారంభానికి ముందు కొన్ని రోజుల సమయమే మిగిలి ఉన్నందున వైద్య నిబంధలన ప్రకారం వారి ఫిట్‌‌నెస్‌‌ను పరీక్షించి తుది నిర్ణయం తీసుకుంటాం’ అని అసిస్టెంట్‌‌ కోచ్‌‌ ర్యాన్‌‌ టెన్‌‌ డస్కెట్‌‌ వెల్లడించాడు. రోహిత్‌‌, కోహ్లీ గాయాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. గతేడాది టెస్ట్‌‌ క్రికెట్‌‌కు గుడ్‌‌బై చెప్పిన కోహ్లీ, రోహిత్‌‌, ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌‌లోనే ఆడుతున్నారు. 2027లో జరగనున్న వన్డే వరల్డ్‌‌ కప్‌‌లో ఆడాలని భావిస్తున్నా.. ఫామ్‌‌, ఫిట్‌‌నెస్‌‌ అధారంగానే వీరి భవిష్యత్‌‌ ఆధాపడి ఉంటుంది. జూన్‌‌ 13, 17, 20న వరుసగా ధర్మశాల, లక్నో, చెన్నైలో ఈ మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ సిరీస్‌‌ తర్వాత టీమిండియా.. ఇంగ్లండ్‌‌ టూర్‌‌కు వెళ్తుంది.