IPL 2024: కోహ్లీ vs క్లాసెన్.. ఐపీఎల్‌లో ఆసక్తికంగా ఆరెంజ్ క్యాప్ రేస్

IPL 2024: కోహ్లీ vs క్లాసెన్.. ఐపీఎల్‌లో ఆసక్తికంగా ఆరెంజ్ క్యాప్ రేస్

అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే ఐపీఎల్(2024) టోర్నీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ముగియగా.. దాదాపు సగం  మ్యాచ్‌ల్లో ఫలితం ఆఖరి ఓవర్‌లో తేలింది. దీని బట్టి టోర్నీ ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఓటమికి ఏ జట్టు తలొంచడం లేదు. దేశానికి ఆడే సమయంలోనైనా ఆటగాళ్లు అలసత్వం చూపేవారేమో కానీ, క్యాష్ రిచ్ లీగ్ ‌లో మాత్రం శక్తినంత పోగేసి పోరాడుతున్నారు.

ఇక ఇప్పటివరకూ ఈ టోర్నీలో బ్యాటింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిని పరిశీలిస్తే భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో దూసుకెళ్తున్నాడు. ఈ జాబితాలో సన్ రైజర్స్ విధ్వంసకర బ్యాటర్ క్లాసెన్ రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ స్ట్రైక్ రేట్ 140గా ఉంటే, క్లాసెన్ స్ట్రైక్ రేట్ ఏకంగా 200పైబడి ఉంది.  

ఆరెంజ్ క్యాప్ రేస్ 

విరాట్ కోహ్లీ (ఆర్‌సీబీ)

గతంలో లాగానే విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో అదరగొడుతున్నాడు. దాదాపు రెండు నెలల విరామం తర్వాత గ్రౌండ్‌లోకి అడుగుపెట్టినప్పటికీ.. పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 3 మ్యాచుల్లో 90 సగటుతో 181 పరుగులు చేశాడు.  ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో దూసుకెళ్తున్నాడు.

హెన్రిచ్ క్లాసెన్ (ఎస్‌ఆర్‌హెచ్)

దక్షిణాఫ్రికా క్రికెటర్, సన్ రైజర్స్ ఆశాదీపం హెన్రిచ్ క్లాసెన్ ఈ సీజన్‌లో ప్రత్యర్థి జట్లు తన పేరు తలుచుకుంటేనే భయపడేలా అడుతన్నాడు. ముంబైపై ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ బ్యాటర్.. పరుగుల వేటలో కోహ్లీ తరువాత స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్ ల్లో 83 సగటుతో 167(219 స్ట్రైక్ రేట్‌‌) పరుగులు చేశాడు.

శిఖర్ ధావన్ (పంజాబ్ కింగ్స్)

జట్టుకు దూరమై ఏళ్లు గడుస్తున్నా.. భారత వెటరన్ శిఖర్ ధావన్ లో సత్తా యంత్రం తగ్గలేదు. తన క్లాసిక్ షాట్లతో జట్టుకు మంచి ఆరంభాన్ని అందిస్తున్నాడు. ధావన్ ఇప్పటివరకూ ఆడిన 3 మ్యాచ్ ల్లో 45 సగటు, 133 స్ట్రైక్ రేట్‌తో 137 పరుగులు చేశాడు.

డేవిడ్ వార్నర్ (ఢిల్లీ క్యాపిటల్స్)

ఆసీస్ చిచ్చరపడుగు, ఢిల్లీ ఓపెనర్ మునుపటిలానే ఐపీఎల్ లో దూసుకుపోతున్నాడు. చెన్నైపై హాఫ్ సెంచరీతో అదరగొట్టిన వార్నర్.. ఆరెంజ్ క్యాప్ రేసులో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్ ల్లో 43 సగటు, 144 స్ట్రైక్ రేట్‌తో 130 పరుగులు చేశాడు.