విశాఖలో వీరన్‌‌‌‌గం..272/7 స్కోరుతో కేకేఆర్‌‌‌‌‌‌‌‌ విధ్వంసం

విశాఖలో వీరన్‌‌‌‌గం..272/7 స్కోరుతో కేకేఆర్‌‌‌‌‌‌‌‌ విధ్వంసం
  •     చెలరేగిన సునీల్ నరైన్‌‌‌‌ 
  •     రఘువంశీ, రసెల్ మెరుపులు
  •     106 రన్స్‌‌‌‌ తేడాతో  ఢిల్లీపై గెలుపు

వారం కిందట ఉప్పల్‌‌‌‌ స్టేడియంలో  సన్‌‌‌‌ రైజర్స్ హైదరాబాద్ పరుగుల ఉప్పెనను మరవకముందే.. విశాఖపట్నంలో కోల్‌‌‌‌కతా నైట్ రైడర్స్‌‌‌‌ ‘రన్‌‌‌‌’రంగం సృష్టించింది.  ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ వీర బాదుడు బాదితే.. అరంగేట్రం కుర్రాడు అంగ్‌‌‌‌క్రిష్ రఘువంశీ మెరుపు ఫిఫ్టీతో ఐపీఎల్‌‌‌‌లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. హార్డ్ హిట్టర్లు ఆండ్రీ రసెల్,రింకూ సింగ్ సైతం రఫ్ఫాడేశారు. మొత్తంగా 22 ఫోర్లు, 18 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించిన  కేకేఆర్‌‌‌‌ 272/7 రన్స్‌‌‌‌తో‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌లో సెకండ్ హయ్యెస్ట్ స్కోరు చేసింది. సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ రికార్డు (277/3)ను కొద్దిలో మిస్సయింది. నైట్ రైడర్స్‌ హ్యాట్రిక్ విక్టరీ సాధించగా..  బౌలింగ్‌‌‌‌తో పాటు  బ్యాటింగ్‌‌‌‌లోనూ తేలిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ లీగ్‌లో మూడో ఓటమి ఖాతాలో వేసుకుంది. 

విశాఖపట్నం : ఐపీఎల్‌‌‌‌17లో కోల్‌‌‌‌కతా నైట్ రైడర్స్‌‌‌‌ కేక పుట్టిస్తోంది. వరుసగా మూడో విక్టరీతో హ్యాట్రిక్ సాధించి టాప్‌ ప్లేస్‌కు చేరుకుంది. గత మ్యాచ్‌‌‌‌ల్లో సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌, ఆర్‌‌‌‌‌‌‌‌సీబీకి చెక్‌‌‌‌ పెట్టిన కేకేఆర్‌‌‌‌‌‌‌‌ ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌కు తమ విశ్వరూపం చూపెట్టింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో లీగ్‌‌‌‌లో సెకండ్ హయ్యెస్ట్‌‌‌‌ స్కోరు నమోదు చేస్తూ 106  రన్స్‌‌‌‌ తేడాతో  ఢిల్లీని ఓడించింది. సునీల్ నరైన్ (39 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 85), అంగ్‌‌‌‌క్రిష్‌‌‌‌ రఘువంశీ (27 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54) ఫిఫ్టీలతో చెలరేగడంతో తొలుత కేకేఆర్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 272/7 స్కోరు చేసింది.

ఆండ్రీ రసెల్ (19 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41), రింకూ సింగ్ (8 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 26) కూడా దంచికొట్టారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నార్జ్‌‌‌‌ మూడు, ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌‌‌లో  ఢిల్లీ  17.2 ఓవర్లలో 166  రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. రిషబ్ పంత్ (25 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 55), ట్రిస్టాన్ స్టబ్స్‌‌‌‌ (32 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54) ఫిఫ్టీలతో పోరాడారు.  స్టార్క్‌ రెండు, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి  చెరో3 వికెట్లు తీశారు.  నరైన్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

దంచుడే దంచుడు

టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన కేకేఆర్ ఇన్నింగ్స్‌‌‌‌ ఫోర్లు, సిక్సర్ల వర్షంతో సాగింది. ఫస్ట్ ఓవర్లో ఓపెనర్లు నరైన్‌‌‌‌, ఫిల్ సాల్ట్ (18) ఖాతా తెరవలేకపోయినా రెండో ఓవర్ నుంచి మోత మొదలైంది. ఇషాంత్ బౌలింగ్‌‌‌‌లో సాల్ట్ రెండు ఫోర్లతో టచ్‌‌‌‌లోకి రాగా.. అతను వేసిన నాలుగో ఓవర్లో నరైన్ 6, 6, 4,6,4తో ఏకంగా 26 రన్స్‌‌‌‌ పిండుకొని టాప్ గేర్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చేశాడు.  ఖలీల్ బౌలింగ్‌‌‌‌లో సాల్ట్ ఔటైనా.. కేకేఆర్ జోరు తగ్గలేదు. వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో బ్యాటింగ్‌‌‌‌కు దిగిన యంగ్‌‌‌‌స్టర్ రఘువంశీ తొలి రెండు బాల్స్‌‌‌‌ను బౌండ్రీకి  చేర్చాడు. ఆపై, రసిఖ్ ధార్ ఓవర్లో నరైన్ మూడు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టి 21 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.

 ఫీల్డింగ్ మారిన తర్వాత కూడా నరైన్, రఘువంశీ అదే జోరు కొనసాగించారు. స్పిన్నర్ అక్షర్ ఓవర్లో నరైన్ రెండు సిక్సర్లు కొడితే.. సుమిత్  ఓవర్లో  6,4..  రసిఖ్ బౌలింగ్‌‌‌‌లో 6, 6తో రఘువంశీ తన బ్యాట్ పవర్ చూపెట్టాడు.  దాంతో 11 ఓవర్లకే స్కోరు 150 దాటింది. సెంచరీ చేసేలా కనిపించిన నరైన్‌‌‌‌..  మిచెల్‌‌‌‌ మార్ష్‌‌‌‌  బౌన్సర్‌‌‌‌‌‌‌‌కు కీపర్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో రెండో వికెట్‌‌‌‌కు  104  రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది. కాసేపటికే 25 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న రఘువంశీని అన్రిచ్ నార్జ్‌‌‌‌ వెనక్కుపంపడంతో ఢిల్లీ కోలుకునేలా కనిపించింది.

కానీ, విండీస్ హిట్టర్ ఆండ్రీ రసెల్‌‌‌‌ ఢిల్లీ బౌలర్లకు ఊపిరిపీల్చుకునే అవకాశం ఇవ్వలేదు. తను కూడా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. రసిఖ్ బౌలింగ్‌‌‌‌లో 6,4... ఖలీల్ ఓవర్లో సిక్స్‌‌‌‌తో స్కోరు 200 దాటించాడు.  రెండు సిక్సర్లతో అలరించిన  కెప్టెన్ శ్రేయస్ అయ్యర్​ (18) ఖలీల్ షార్ట్‌‌‌‌ బాల్‌‌‌‌ను వెంటాడి స్టబ్స్‌‌‌‌కు క్యాచ్ ఇవ్వగా 18 ఓవర్లకు కేకేఆర్‌‌‌‌‌‌‌‌ 239/4తో నిలిచింది.  స్లో ఓవర్‌‌‌‌‌‌‌‌రేట్ కారణంగా ఢిల్లీపై పెనాల్టీ విధించిన అంపైర్లు చివరి రెండు ఓవర్లలో సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లకు అనుమతించారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న మరో హిట్టర్ రింకూ సింగ్..  అన్రిచ్ వేసిన 19వ ఓవర్లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌‌‌‌‌‌‌‌తో విరుచుకుపడ్డాడు.

25 రన్స్ రాబట్టి లాస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కు ఔటయ్యాడు.  స్కోరు 264/5గా మారగా  రసెల్ క్రీజులో ఉండటంతో కేకేఆర్‌‌‌‌‌‌‌‌ ఈజీగా ఐపీఎల్‌‌‌‌ హయ్యెస్ట్ స్కోరు బ్రేక్‌‌‌‌ చేసేలా కనిపించింది. కానీ, లాస్ట్‌‌‌‌ ఓవర్లో ఇషాంత్ సూపర్‌‌ బౌలింగ్‌‌‌‌ చేశాడు. తొలి బాల్‌‌‌‌కే అద్భుతమైన ఇన్‌‌‌‌స్వింగింగ్ యార్కర్‌‌‌‌‌‌‌‌తో రసెల్‌‌‌‌ను క్లీన్‌‌‌‌బౌల్డ్‌‌‌‌ చేశాడు. బ్యాలెన్స్‌‌‌‌ కోల్పోయి రసెల్ కింద పడ్డాడు. మూడో బాల్‌‌‌‌కు రమణ్‌‌‌‌దీప్ (2) ఔట్‌‌‌‌ అవగా.. ఐదో బాల్‌‌‌‌ను బౌండ్రీకి పంపిన వెంకటేశ్ అయ్యర్ (5 నాటౌట్‌‌‌‌) లాస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కు సింగిల్ మాత్రమే తీయడంతో రికార్డు స్కోరుకు కేకేఆర్‌‌‌‌‌‌‌‌ ఐదు రన్స్‌‌‌‌ దూరంలో ఆగిపోయింది.

పంత్, స్టబ్స్‌‌‌‌ పోరాడినా

భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయిన ఢిల్లీ డీలా పడింది. పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేలోనే వైభవ్ అరోరా, మిచెల్ స్టార్క్ చెరో రెండు వికెట్లతో ఆ టీమ్‌‌‌‌ను దెబ్బకొట్టారు. ఫస్ట్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఊపు మీద కనిపించిన ఓపెనర్ పృథ్వీ షా (10) వైభవ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో చక్రవర్తి పట్టిన చురుకైన క్యాచ్‌‌‌‌కు ఔటయ్యాడు. స్టార్క్ ఫుల్ బాల్‌‌‌‌ను కట్‌‌‌‌ షాట్ ఆడే ప్రయత్నంలో రమణ్‌‌‌‌దీప్‌‌‌‌కు క్యాచ్ ఇచ్చిన మిచెల్ మార్ష్‌‌‌‌ (0) డకౌటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ అభిషేక్ పోరెల్ (0) సైతం ఖాతా తెరవలేకపోయాడు. వైభవ్ షార్ట్‌‌‌‌బాల్‌‌‌‌ను వెంటాడి నరైన్‌‌‌‌కు సింపుల్‌‌‌‌ క్యాచ్ ఇచ్చాడు.

రెండు ఫోర్లు, సిక్స్‌‌‌‌తో క్రీజులో కుదురుకున్నట్టు కనిపించిన వార్నర్‌‌‌‌‌‌‌‌ (18) స్టార్క్‌‌‌‌ గుడ్‌‌‌‌ లెంగ్త్‌‌‌‌ బాల్‌‌‌‌ను వికెట్ల మీదకు ఆడుకోవడంతో ఢిల్లీ 33/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్ తన ఫస్ట్ బాల్‌‌‌‌నే సిక్స్‌‌‌‌గా మలిచాడు. ట్రిస్టాన్ స్టబ్స్‌‌‌‌ సపోర్ట్‌‌‌‌తో ఇన్నింగ్స్‌‌‌‌ను చక్కదిద్దాడు. రసెల్‌‌‌‌ ఓవర్లో పంత్‌‌‌‌ వరుసగా రెండు సిక్సర్లు కొట్టగా.. స్పిన్నర్ వరుణ్ ఓవర్లో స్టబ్స్ కూడా రెండు బాల్స్‌‌‌‌ను స్టాండ్స్‌‌‌‌కు పంపాడు.

ఇక, వెంకటేశ్ అయ్యర్ వేసిన 12వ ఓవర్లో పంత్ వరుసగా 4,6,6,4,4,4తో ఏకంగా 28 రన్స్ రాబట్టాడు.ఈ క్రమంలో ఫిఫ్టీ కూడా పూర్తి చేసుకోవడంతో ఢిల్లీ రేసులోకి వచ్చింది. కానీ, చక్రవర్తి వరుస బాల్స్‌‌‌‌లో పంత్‌‌‌‌, అక్షర్ (0), తన తర్వాతి ఓవర్లో  స్టబ్స్‌‌‌‌ను కూడా ఔట్ చేసి ఢిల్లీ ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. 

2 ఐపీఎల్‌‌‌‌లో ఇది సెకండ్ హయ్యెస్ట్ స్కోరు. వారం కిందట ఉప్పల్ లో ముంబైపై సన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌ 277/3  స్కోరుతో రికార్డు సృష్టించింది.

88/1 పవర్‌‌ప్లేలో కేకేఆర్ స్కోరు. లీగ్‌‌లో నాలుగో అత్యధికం. ఆర్‌‌సీబీ (105/0) టాప్‌‌లో ఉంది.

1 ఐపీఎల్‌‌ అరంగేట్రంలో ఫిఫ్టీ చేసిన యంగెస్ట్‌‌ బ్యాటర్‌‌ అంగ్‌‌క్రిష్‌‌ రఘువంశీ  (18 ఏళ్ల 303 రోజులు). అలాగే అరంగేట్రంలో ఫాస్టెస్ట్‌‌ ఫిఫ్టీ చేసిన రెండో ప్లేయర్‌‌ (25 బాల్స్‌‌లో)గా నిలిచాడు హోప్‌‌ (24 బాల్స్‌‌) ముందున్నాడు.

సంక్షిప్త స్కోర్లు

కోల్‌‌‌‌కతా : 20 ఓవర్లలో 272/7 (నరైన్‌‌‌‌ 85, రఘువంశీ 54, రసెల్ 41 , అన్రిచ్ 3/59)

ఢిల్లీ :  17.2 ఓవర్లలో 166 ఆలౌట్‌‌‌‌ (పంత్ 55, స్టబ్స్‌‌‌‌ 54,  వైభవ్  3/27, చక్రవర్తి 3/33)