కమనీయం.. కొమరవెల్లి మల్లన్న కల్యాణం..జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభం..

కమనీయం.. కొమరవెల్లి మల్లన్న కల్యాణం..జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభం..
  •     పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ, 
  • ఎండోమెంట్  ప్రిన్సిపల్  సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హరీశ్
  •     స్వామి కల్యాణంతో జాతర బ్రహ్మోత్సవాలు షురూ

కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం తోటబావి వద్ద మల్లన్న కల్యాణ మండపంలో కన్నుల పండువగా జరిగింది. ప్రభుత్వం తరఫున ఎండోమెంట్​ మంత్రి కొండా సురేఖ, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ స్వామివారికి బంగారు పుస్తె మట్టెలు, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను  సమర్పించారు. ఈ వేడుకకు 30 వేల మంది భక్తులు హాజరయ్యారు. మల్లన్న కల్యాణంతో  జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం వీరశైవ ఆగమ సంప్రదాయం ప్రకారం కమనీయంగా జరిగింది. ఆదివారం కొమురవెల్లిలో తోటబావి వద్ద మల్లన్న కల్యాణ మండపం మల్లన్న నామస్మరణతో మారుమోగింది. స్వామి కల్యాణంతో జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

 ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ, ఎండోమెంట్ ప్రిన్సిపల్  సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్  హరీశ్  స్వామివారికి బంగారు పుస్తె మట్టెలు, పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కళ్యాణం అనంతరం గర్భగుడిలో స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

పీఠాధిపతులు 1008 మహామండలేశ్వర్  మహంత్  సిద్దేశ్వరానందగిరి మహారాజ్  ఆధ్వర్యంలో మల్లన్న కల్యాణాన్ని జరిపించారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం మల్లికార్జునస్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఊరేగింపుగా తోటబావి కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. బలిజమేడాలదేవి, గొల్లకేతమ్మ తరుపున మహాదేవుని వంశస్తులైన వినయ్  దంపతులు, వరుడు మల్లికార్జునస్వామి తరుపున పడిగన్నగారి వంశస్తులైన మల్లయ్య దంపతులు పెండ్లి పెద్దలుగా వ్యవహరించారు. 

రెండున్నర గంటల పాటు సాగిన కల్యాణాన్ని భక్తులు తిలకించారు. మల్లన్న నామస్మరణతో భక్తిపారవశ్యులయ్యారు. కల్యాణోత్సవం అనంతరం మల్లన్న రథాన్ని పదహారేళ్ల బండ్లతో మల్లన్న గుట్ట చుట్టూ తిప్పి శకటోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పూలు, పండ్లతో అందంగా అలంకరించిన రథంలో మల్లికార్జునస్వామి ఉత్సవ విగ్రహం పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి శకటోత్సవాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి చామకుర మల్లారెడ్డి, జోగిని శ్యామల, ఈవో టంకశాల వెంకటేశ్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్  నర్సింహారెడ్డి, ఆలయ ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.

అమ్మవార్లకు బంగారు కిరీటాలు చేయిస్తం..

మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల నాటికి మేడాలదేవి, కేతమ్మలకు 2 కిలోల బంగారు కిరీటాలు, స్వామి వారి పల్లకికి వెండి తాపడం చేయిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. మల్లన్న కల్యాణం వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉందని, ఆలయ అభివృద్ధికి త్వరలోనే మాస్టర్  ప్లాన్  రూపొందిస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. సమ్మక్క-సారక్క జాతరకు భారీగా నిధులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.