బియ్యం సేకరణతో మల్లన్న కల్యాణ తంతు షురూ

బియ్యం సేకరణతో మల్లన్న కల్యాణ తంతు షురూ

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు, అర్చకులు అన్ని ఏర్పాట్లు చేశారు.  తోటబావి వద్ద వేదికను, ప్రత్యేక గ్యాలరీలను ముస్తాబు చేశారు. శ్రీ బలిజ మేడలాదేవి, శ్రీ గొల్ల కేతమ్మ సమేత శ్రీ మల్లికార్జునస్వామి కల్యాణ మహోత్సవాన్ని పర్యవేక్షించేందుకు ఉజ్జయిని పీఠాధిపతి వీరశైవ ఆగమ సంప్రదాయ పీఠాధిపతులు మహామండలేశ్వర్ డాక్టర్ మహంత్ సిద్దేశ్వరానందగిరి మహారాజ్ స్వామీజీ శనివారం కొమురవెల్లికి చేరుకోగా ఘనంగా స్వాగతించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగే దృష్టి కుంబాల కోసం రతి బియ్యం సేకరణతో  కల్యాణ తంతు ప్రారంభమైంది. 

ఊరేగింపుగా గ్రామంలోని ఇండ్లలో ప్రత్యేక పూజలు చేసి వీరభద్రుడి ఖడ్గం, బల్లెరంతో రతి బియ్యాన్ని సేకరించి మల్లన్న ఆలయం వద్దకు చేర్చారు.  స్వామి కల్యాణ మండప డెకరేషన్, వీఐపి సిట్టింగ్, సామాన్య భక్తులకు కుర్చీలు, మీడియా గ్యాలరీ ఏర్పాట్లు చుట్టూ బారి కేడ్ల ఏర్పాట్లను కలెక్టర్ హైమావతి పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ  మల్లన్న కల్యాణం వైభవంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.  

భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించాలని, పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు. పంచాయతీ, ఆలయ, కాంట్రాక్టు కార్మికులందరూ సమన్వయంతో ఆలయ పరిసరాలను క్లీన్ గా ఉంచాలని పేర్కొన్నారు.  అధికారుల సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.