కొమురవెల్లిలో భక్తుల సందడి.. మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లింపు

కొమురవెల్లిలో భక్తుల సందడి.. మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లింపు

కొమురవెల్లి, వెలుగు: ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. శనివారం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని సత్రాలు, ప్రైవేట్ గదుల్లో బసచేశారు. తెల్లవారుజామున కోనేరులో  స్నానాలు చేసి శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి పట్నం, అభిషేకం, అర్చన, నిత్యా కల్యాణం, బోనం, తిరుగుడు కోడె, కేశ ఖండన, గంగిరేగు చెట్టుకు ముడుపులు కట్టి భక్తులు మొక్కులు చెల్లించారు.  అనంతరం కొండపైన రేణుక ఎల్లమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లను దర్శించుకొని బోనాలు సమర్పించారు. 

ఆలయంలో నిత్యాన్నదానానికి కరీంనగర్ జిల్లా దుర్షడ్ గ్రామానికి చెందిన రాపల్లి మహేశ్, దివ్య దంపతులు రూ.1,00,116 చెల్లించి పథకంలో మహారాజ పోషకులు (శాశ్వత సభ్యులు) గా చేరారు. చెక్కును ఆలయ ఈఓ టి. వెంకటేశ్​ అందించారు. ఏఈఓ బుద్ది శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు శ్రీరాములు, ధర్మకర్తలు లింగంపల్లి శ్రీనివాస్, వల్లద్రి అంజిరెడ్డి, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఓగ్గు పూజారులు భక్తులకు సేవలందిచారు.