సారూ..మా కడుపు కొట్టొద్దు..కోమటిబండ వడ్డెరల ఆవేదన

సారూ..మా కడుపు కొట్టొద్దు..కోమటిబండ వడ్డెరల ఆవేదన
  •    బండను నమ్ముకొనే జీవిస్తున్నం
  •     కోమటిబండ వడ్డెరల ఆవేదన
  •     సీఎంను కలిసేందుకు ప్రయత్నం
  •     అడ్డుకున్న పోలీసులు

సిద్దిపేట, వెలుగు: ‘‘ఎన్నో ఏండ్లసంది బండను నమ్ముకుని బతుకుతున్నం సారూ.. బండ కొట్టి కుటుంబాలను పోషించుకుంటున్నం. నాలుగేండ్ల సంది బండ మీదికి రానిస్తలేరు. మా ఉపాధికి గండి కొడుతున్నరు. మా కడుపు కొడుతున్నరు. మీరైనా కనికరించండి” అంటూ సీఎం కేసీఆర్​ను సిద్దిపేట జిల్లా కోమటిబండ గ్రామ వడ్డెరలు కలిసేందుకు సిద్ధమవగా పోలీసులు అడ్డుకున్నారు. కోమటిబండకు చెందిన 50 వడ్డెర కుటుంబాలు గ్రామ సమీపంలోని 80 ఎకరాల్లో విస్తరించిన బండను కొట్టి సమీప ప్రాంతాల్లో అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. నాలుగేండ్ల క్రితం మిషన్​ భగీరథ ప్లాంట్​తోపాటు నాలెడ్జ్ సెంటర్​ను అక్కడ ఏర్పాటు చేసిన అధికారులు.. వడ్డెర్లు రాకుండా నిషేధం విధించారు. ఎన్నో ఏండ్లుగా కడుపు నింపుతున్న బండపైకి రావద్దని అధికారులు చెప్పడంతో తమకు ఉపాధి లేకుండా పోయిందని అధికారులకు, మంత్రులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని వడ్డెరలు వాపోతున్నారు. బుధవారం కోమటి బండకు సీఎం కేసీఆర్​ వస్తున్నారన్న విషయం తెలుసుకున్న  గ్రామ వడ్డెర కుటుంబాల వాళ్లు ఆయనకు వినతి పత్రం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రోడ్డుపైన నిలబడి సీఎంను కలుద్దామని అనుకున్నారు. ఇంతలో పోలీసులు వచ్చి వారిని వెళ్లగొట్టారు. సార్​కు వినతి పత్రం ఇచ్చి న్యాయం చేయాలని కోరతామని వేడుకున్నా వినలేదు. ఆందోళన చేస్తారోనని అనుమానించి అదనంగా మరింత మంది పోలీసులు మోహరించారు. కోమటి బండపైకి రానివ్వక పోవడంతో తమకు పూట గడవటమే కష్టంగా మారిందని వడ్డెర సంఘం నేతలు ఎల్లయ్య, రాజయ్య, శ్రీనివాస్  ‘వెలుగు’తో చెప్పుకున్నారు.