కోమటిరెడ్డి బ్రదర్స్ అహంకారం వల్లే బైపోల్ : కడియం శ్రీహరి

కోమటిరెడ్డి బ్రదర్స్ అహంకారం వల్లే బైపోల్ : కడియం శ్రీహరి

హైదరాబాద్: కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే కాంగ్రెస్ సర్వనాశనం అయ్యిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆరోపించారు. కడియం శ్రీహరి గురించి మాట్లాడేంత స్థాయి తనది కాదని, ఆ పని ఎమ్మెల్యే రాజయ్య చూసుకుంటారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కడియం స్పందించారు. వాళ్లు కోమటిరెడ్డి బ్రదర్స్ కాదని.. కోవర్ట్ బ్రదర్స్ అని మండిపడ్డారు. తన పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయకుండా తన తమ్ముడికి పరోక్షంగా సహకరిస్తున్న వెంకట్ రెడ్డి కోవర్ట్ కాదా అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అహంకారం, బీజేపీ అధికార దాహం వల్లే ఇవాళ మునుగోడు బైపోల్ వచ్చిందని చెప్పారు.


మోడీ ఎనిమిదేళ్ల పాలనలో దేశం అన్ని విభాగాల్లో అధోగతి పాలయ్యిందని, దేశ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని చెప్పారు. బీజేపీ పాలనలో బడుగు, బలహీన వర్గాల జీవితాలు నాశనం అయ్యాయని ఆరోపించారు. మోడీ హయాంలో  దేశ ఆర్ధిక వృద్ధిరేటు తగ్గుతూ వస్తోందని, రూ. 58.60 నుంచి  82.32 వరకు రూపాయి విలువ పడిపోయిందని మండిపడ్డారు. రూపాయి విలువ పడిపోకుండా మోడీ ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు.  ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఒక్కొక్కటిగా మోడీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని, దీంతో లక్షలాది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా రిజర్వేషన్లను ఎత్తేసేందుకు కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. మునుగోడులో బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కులేదని శ్రీహరి చెప్పారు.