
- మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మునుగోడు, వెలుగు: టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతికి అడ్డుకట్ట వేయడం బీజేపీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని కిష్టాపురం, ఇప్పర్తి, రావిగూడెం, జక్కలవారిగూడానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. రాజగోపాల్రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం ఎనిమిదిన్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ఆ అవినీతి సొమ్మును బీజేపీ వెలికితీస్తుందన్నారు. తన రాజీనామాతో మునుగోడులో అభివృద్ధి పరుగులు పెడుతోందని, రాజీనామా వృథా కాలేదని అన్నారు.
ప్రజలు తనకు అండగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ అంటే తమకు ఎంతో గౌరవం అని, కానీ రాష్ట్రంలో, దేశంలో పార్టీ వీక్ అయిపోయిందన్నారు. డబ్బులు ఇచ్చి రాష్ట్ర పీసీసీ పదవి కొనుక్కున్న వ్యక్తి ఆధ్వర్యంలో ఎలా పనిచేయాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఆలోచించుకోవాలని సూచించారు.కేసీఆర్ ను ఎదుర్కోవడం బీజేపీతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు వేదాంతం గోపీనాథ్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, గుజ్జ కృష్ణ, చీకటిమాడి మాజీ సర్పంచ్ యాదయ్య, మేకల ప్రమోద్ రెడ్డి, పులకరం సైదులు, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.