హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో ఇటీవల ప్రభుత్వ పనితీరు, పార్టీ వ్యవహారాలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిలతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి బీఎం సందీప్ భేటీ అయ్యారు.
సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో హైదరాబాద్‌లోని ప్రజాభవన్ గెస్ట్‌హౌస్‌లో ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. పార్టీ, ప్రభుత్వంపై ఇద్దరు ఎమ్మెల్యేలు చేస్తున్న వరుస వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఇద్దరు ఎమ్మెల్యేలు బీఎం సందీప్‌ను కలవాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సందీప్‌తో సమావేశమైన ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను, పార్టీతో పాటు ప్రభుత్వ వ్యవహారాలపై తమ వాదనలను వివరించినట్లు సమాచారం.
ఇద్దరు ఎమ్మెల్యేలు చెప్పిన అంశాలను సావధానంగా విన్న బీఎం సందీప్.. అనంతరం ఏఐసీసీ ఆలోచనను వారికి వివరించినట్లు తెలిసింది. పార్టీకి మీపై ఎంతో గౌరవం ఉందని, ఏఐసీసీకి కూడా మీపై మంచి అభిప్రాయం ఉందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
రానున్న రోజుల్లో మీకు మంచి బాధ్యతలు వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యేలకు సందీప్ భరోసా ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ భేటీ అనంతరం ఇద్దరు ఎమ్మెల్యేలు సానుకూల ధోరణితో అక్కడి నుంచి వెళ్లినట్లు సమాచారం.
అయితే, ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తాజా భేటీతో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల అసంతృప్తి వ్యవహారానికి ఎలాంటి పరిష్కారం లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
