ఢిల్లీలో జాతీయ నేతలను కలవనున్న కోమటిరెడ్డి రాజగోపాల్

ఢిల్లీలో జాతీయ నేతలను కలవనున్న కోమటిరెడ్డి  రాజగోపాల్

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నిక తర్వాత మొదటిసారి బీజేపీ జాతీయ నేతలను కలిసేందుకు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయిన పరిస్థితులు, గెలుపు కోసం టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడటం, ఇన్ని ఒత్తిళ్ల మధ్య అక్కడి ప్రజలు పార్టీని ఆదరించిన తీరు.. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి జాతీయ నేతలకు ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి వివరించనున్నారు. తన కంపెనీలపై రాష్ట్ర జీఎస్టీ అధికారుల దాడులపైనా వివరించనున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్  షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, రాష్ట్ర సంస్థాగత ఇంచార్జీ సునీల్ బన్సల్, రాజకీయ ఇంచార్జీ తరుణ్ చుగ్ తో పాటు ఇతర నేతలను రాజగోపాల్ రెడ్డి కలవనున్నారు. అమిత్ షా తో పాటు ఇతర నేతలను మంగళవారం రాత్రికి లేదా బుధవారం కలిసే అవకాశం ఉంది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. వీరు కూడా పలువురు పార్టీ ముఖ్య నేతలను కలవనున్నారు.