
నల్గొండ/మునుగోడు, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లు చేపట్టడం లేదన్న ఆందోళనతో చాలా మంది రైతులు తక్కువ ధరకు మిల్లర్లకు వడ్లను అమ్ముకున్నారని, ఆ రైతులందరికీ మద్దతు ధర చెల్లించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మునుగోడులో మీడియాతో మాట్లాడారు. యాసంగి సీజన్ ప్రారంభంలో రైతులు వరి సాగుకు ప్రయత్నించగా వడ్లు కొనబోమని అధికారుల చేత ప్రచారం చేయించి, అనేకమంది రైతులను పంట సాగు చేసుకోకుండా అడ్డుపడ్డారని అన్నారు. నాలుగు రోజులు కిందటి వరకు కూడా టీఆర్ఎస్ నేతలు అనేక డ్రామాలు ఆడి ధర్నాలు, రాస్తారోకోలు చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి రైతు దగ్గర వడ్లను కొనాలని, లేకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. రైతుల రుణమాఫీ చేయకుండా వాళ్లపై ప్రేమ ఉన్నట్లు కేసీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. స్టార్ క్యాంపెయినర్‌గా 18 నెలల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తానని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తానన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెంట డీసీసీబీ డైరెక్టర్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.