ఏఐసీసీ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఫోన్

ఏఐసీసీ  నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి  ఫోన్

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఇవాళ ప్రియాంక గాంధీతో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలువురు నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న రాత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. తనను విమర్శించిన నేతలను పార్టీ నుంచి తొలగించాలని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను బుజ్జగించే అవకాశం ఉన్నట్లు తెలిసింది.  మునుగోడు ఉపఎన్నికపై ఇటీవల  తెలంగాణ  కాంగ్రెస్ నేతలతో ప్రియాంక గాంధీ భేటీ అయ్యారు. పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి,ఉత్తమ్,మధుయాష్కీ,జీవన్ రెడ్డి పలువురు నేతలు హాజరవ్వగా.. ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరు కాలేదు.

తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొందరు వ్యవహరిస్తున్నందునే తాను మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉంటున్నానని ఇటీవల  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి అన్నారు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్​కు సేవ చేస్తున్న తనకు ఈ మధ్య ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని సోనియాకు ఆయన లేఖ రాశారు. పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందునే మునుగోడుపై జరుగుతున్న భేటీకి హాజరు కాలేకపోతున్నానని పేర్కొన్నారు. రేవంత్​ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించానని, కాంగ్రెస్​ అభ్యున్నతికి ఎంతో చేశానని ఆ లేఖలో  వెంకట్​రెడ్డి చెప్పారు.