సోనియాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ

సోనియాతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. నాకు పీసీసీ ఇవ్వమంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు బహిరంగంగానే డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక జరుగుతోంది. టీపీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నారు. తాను ఎంపీ అయినప్పటికీ పీసీసీ ఇస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కి ఆ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినట్టే తనకు ఇచ్చినా ఇబ్బంది ఉండబోదంటున్నారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న మనిషికే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి కోరుతున్నారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు ఎంతకాలం పార్టీలో ఉంటారో తెలియదని, పార్టీ ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలే చూసుకుంటారని కోమటిరెడ్డి వాదిస్తున్నారు.

కమిటీ మీటింగ్ కోసమే వచ్చా

కమిటీ మీటింగ్ కోసమే డిల్లీ వచ్చానని కోమటిరెడ్డి చెబుతున్నా.. వాస్తవంలో పీసీసీ అడుగుతున్న విషయం బహిరంగ రహస్యం. ఇదే విషయాన్ని ఆయన ఆఫ్ ద రికార్డు గా అంగీకరిస్తున్నారు కూడా. పార్టీ కోసం ఎప్పటి నుంచో పని చేస్తున్నా… పదవులు ఇవ్వక పోయిన పార్టీ కోసం పని చేస్తానంటున్నారు. వీలైతే రాహూల్ గాంధీ ని కూడా కలుస్తానంటున్నారు. మిగతా వారి మాదిరే నేనూ పీసీసీ రేసులో ఉన్నా.. పదవి ఆశిస్తే తప్పేముందని కోమటిరెడ్డి చెబుతున్నారు.