
- ఇయ్యాల దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి సందర్భంగా..
‘అమరజీవివి నీవు కొమురయ్యా..అందుకో జోహార్లు కొమురయ్యా’ అంటూ చైతన్య నినాదాలతో మారుమోగిన కడవెండి మట్టిలోనే తెలంగాణ ప్రజా ఉద్యమం మొలకెత్తింది. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన దొడ్డి కొమురయ్య స్ఫూర్తి తెలంగాణ ఉద్యమాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.
నేటి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆయన త్యాగమే పునాది అని చెప్పుకోవచ్చు. 1946 జులై 4న దేశ్‌ముఖ్‌లు, దొరల అణచివేతలపై తిరుగుబాటు చెలరేగిన సమయంలో కడవెండిలో ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలో దొడ్డి కొమురయ్య ధ్వజమెత్తాడు. గుండెల్లో బుల్లెట్లు దిగుతున్నా.. పిడికిలి బిగించి ‘జై ఆంధ్రమహాసభ!’ అంటూ చివరి శ్వాసలోనూ ఉద్యమ నినాదాలే పలికాడు.
ఆయన సహోదరుడు దొడ్డి మల్లయ్యతో కలిసి జరిగిన నిరసన ఊరేగింపు జానమ్మదొర గూండాలను గడగడలాడించింది. గుతపలు, బరిసెలతో సాగిన ఆ ఉద్యమంలో, కాల్పుల్లో కొమురయ్య వీరమరణం చెందడం నిజాం సంస్థానంలోని రైతాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అదే మారుమూల గ్రామమైన కడవెండిని చరిత్రలో చిరస్థాయిగా నిలిపింది.
వెట్టిచాకిరి సంకెళ్లు తెంచిన యువసింహం
నిజాం రాజ్యంలో దేశముఖ్‌లు, జమీందారుల అరాచకాలు యథేచ్ఛగా జరిగేవి. వారి అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజల మద్ధతుతో పోరాడిన సంఘాల నినాదాలు దొడ్డి కొమురయ్య చేతుల్లో బరిసెగా మారాయి. మొండ్రాయిలో లంబాడీల భూములు, పాలకుర్తిలో చాకలి అయిలమ్మ భూమి, ధర్మపురంలో రజాకారుల దాడులు... ఇలా అనేక సంఘటనలు ప్రజలలో పోరాట స్పృహను పెంపొందించాయి. ఈ ఉద్యమాలకే మార్గదర్శిగా నిలిచింది కొమురయ్య ధైర్యగాథ. ఆయన పోరాట పటిమను నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలి.
తెలంగాణ ఉద్యమానికి శిల్పి
నాటి నల్గొండ జిల్లా కడవెండిలో మొదలైన ఉద్యమజ్వాల హైదరాబాద్ సంస్థానమంతటా వ్యాపించింది. విస్నూరు దేశముఖ్ రాపాక రామచంద్రారెడ్డి వంటి దేశ్‌ముఖ్‌లు, దొరల అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజలు దీటుగా ఉద్యమ బావుటాను ఎగురవేశారు. నిజాం వ్యతిరేక నినాదాలు, గుతపల సప్పుడు, ఎర్రజెండా ఉరుముతో గ్రామాలన్నీ మారుమోగాయి. దొరల గడీలు పతనమయ్యాయి. నిజాం పాలన శీఘ్రపతనానికి గురైంది. దీని పునాదిలో దొడ్డి కొమురయ్య లాంటి అమరుల బలిదానం స్ఫష్టంగా కనిపిస్తుంది.
ఒక అమరుడు..అనేక ఉద్యమాలకు అంకురంగా దొడ్డి కొమురయ్య నిలిచాడు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణానంతరం దొడ్డి కొమురయ్యకు శకం మొదలైంది. ఊరూరా విగ్రహాలు, స్థూపాలు వెలిశాయి. అవి వేలాది యువతరానికి స్ఫూర్తిగా మారాయి. ప్రతి పోరాట వేదికలపై పలుమార్లు ‘తెలంగాణ పునర్నిర్మాణానికి దొడ్డి కొమురయ్య లాంటి యోధుల బలిదానాలే బలం’ అని నేతలు పేర్కొన్నదీ యాదృచ్ఛికం కాదు దొడ్డి కొమురయ్య ప్రాణత్యాగ నినాదం.
జోహార్లు కొమురయ్య జోహార్. ఈ రోజు జులై 4న దొడ్డి కొమురయ్య 79వ వర్ధంతి. కొమురయ్య జీవితం, పోరాటం, త్యాగం నేటి తరానికి మార్గదర్శిగా నిలు స్తోంది. ఉద్యమాల కోసం జీవించి, ఉద్యమాలకే ప్రాణం అర్పించిన ఓ రైతు కుటుంబ యువకుడికి తెలంగాణ రాష్ట్రం సెల్యూట్ చేస్తోంది.
- మరిపాల శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్