మల్లన్న మాస్టర్ ప్లాన్ కలేనా?..కాగితాలకే పరిమితమైన ప్లాన్

మల్లన్న మాస్టర్ ప్లాన్ కలేనా?..కాగితాలకే పరిమితమైన ప్లాన్
  • పుష్కర కాలం కింద మ్యాపుల తయారీ
  • కాగితాలకే పరిమితమైన ప్లాన్
  • ప్రభుత్వ జాబితాలో దక్కని చోటు

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: పుష్కర కాలం కింద కొమురవెల్లి మల్లన్న క్షేత్రం అభివృద్ధి కోసం తయారు చేసిన మాస్టర్​ప్లాన్​ అటకెక్కింది. 2011లోనే హైదరాబాద్ కు చెందిన ఓ కన్సెల్టెన్సీతో క్షేత్ర స్థాయిలో  సర్వే చేయించి ముసాయిదా సిద్ధం చేశారు. 

ఇందులో భాగంగా  ఆలయ పరిసరాలలోని వీధులను వెడల్పు చేయడం, భక్తులకు ప్రత్యేక వసతి గృహాల నిర్మాణం, వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించడం, జాతర సమయంలో ఏర్పడే ఇబ్బందులను తొలగించడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. కానీ దీనిపై నేతల హామీలే తప్ప ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 9 ఆలయాలకు మాస్టర్ ప్లాన్ తయారు చేసిన జాబితాలో కొమురవెల్లికి చోటు దక్కలేదు. దీంతో  కొమురవెల్లి మాస్టర్ ప్లాన్ డిమాండ్ మళ్లీ తెరపైకి వస్తోంది. 

పెరుగుతున్న భక్తుల రద్దీ

ఇటీవల మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ బాగా పెరుగుతోంది. ఏటా 15 లక్షల మంది స్వామిని దర్శించుకుంటున్నారు. దాదాపు రూ.20 కోట్ల ఆదాయంతో ప్రధాన ఆలయాల్లో ఒకటిగా నిలుస్తోంది. శని, ఆది, సోమవారాల్లో భక్తుల రద్దీ కారణంగా కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాత మాస్టర్ ప్లాన్ కాకుండా రాబోయే 50 ఏండ్ల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్త మాస్టర్ ప్లాన్ తయారుచేసి అమలుచేయాలని స్థానికులు కోరుతున్నారు.   

అమలు కాని కేసీఆర్ హామీ 

రాజీవ్​రహదారి నుంచి వై జంక్షన్​మీదుగా మల్లన్న క్షేత్రానికి వచ్చే రెండు రోడ్లను నాలుగు లైన్లుగా అభివృద్ధి చేస్తానని అప్పటి సీఎం కేసీఆర్​హామీ ఇచ్చారు. కానీ అది అమలుకు నోచుకోలేదు. మరోవైపు రాజీవ్  రహదారి నుంచి రెండు ప్రవేశ ద్వారాలను కలుపుతూ బైపాస్​రోడ్డును నిర్మిస్తే భక్తుల రాకపోకలతో ఎలాంటి ఇబ్బంది ఉండదని స్థానికులు కోరుతున్నారు. కొమురవెల్లిలోని  బండ గుట్టపై  50 గదుల ధర్మశాల నిర్మాణ పనులు దాదాపు నాలుగేండ్లుగా సాగుతూనే ఉన్నాయి. దర్శనానికి వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగించడం కోసం ప్రారంభించిన క్యూ లైన్ కాంప్లెక్స్ పనులు రెండేళ్లుగా కొనసాగుతున్నాయి. మల్లన్న గుట్టపై  ఢమరుకం, త్రిశూల నిర్మాణ పనులు నత్తన నడకన సాగుతున్నాయి.

కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాలి

కొమురవెల్లి ఆలయ అభివృద్ధి కోసం 2011లో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. కానీ చాలా సంవత్సరాలు గడిచిపోవడంతో ప్రస్తుతం కొత్త మాస్టర్​ప్లాన్ రూపొందించాల్సి ఉంటుంది. మూడు నెలల బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారి అవసరాలకు తగ్గట్టుగా కొత్త  మాస్టర్ ప్లాన్ రెడీ చేసి పంపిస్తాం. - అన్నపూర్ణ, ఈవో, కొమురవెల్లి దేవస్థానం