కొమురవెల్లిలో కోరమీసాల మల్లన్నకు కోటొక్క దండాలు

కొమురవెల్లిలో కోరమీసాల మల్లన్నకు కోటొక్క దండాలు

కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సంక్రాంతి తర్వాత వచ్చే సత్తేటి వారాలలో భాగంగా మూడో వారానికి భక్తులు భారీగా తరలివచ్చారు. మల్లన్నకు మట్టికుండలో నైవేద్యం వండి డప్పు చప్పుళ్ల మధ్య బోనాలు సమర్పించి, గంగిరేగు చెట్టువద్ద పట్నాలు వేసి  మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే,  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్​, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ గతంలో మాజీ సీఎం కేసీఆర్ రెండు సార్లు దర్శనానికి వచ్చి ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు, రూ.200 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి ఎగ్గొట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. త్వరలో మల్లన్న ఆలయ అభివృద్ధి కోసం దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖను కలిసి ప్రత్యేక నిధులు కేటాయించేలా కృషి చేస్తానన్నారు. జాతరలో అక్రమంగా పాసులు అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.