నేడు ( సెప్టెంబర్ 27)ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

నేడు ( సెప్టెంబర్ 27)ఆచార్య  కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించి రాజకీయ నాయకుడిగానే కాదు, రాజనీతిజ్ఞుడిగా విశేష కీర్తి పొంది చరిత్ర పుటల్లో స్వయం కృషితో తన పేరును తనే లిఖించుకున్న గొప్ప ప్రజ్ఞాశాలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. తను జ్ఞాపకం ఎరిగిన నాటి నుంచి ఉద్యమాలే జీవితంగా బతికి, తన సర్వస్వాన్ని ప్రజల కోసం ధారపోసిన ధీశాలి ఆయన. తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకోవడమే కాకుండా తెలంగాణ వచ్చే వరకు ఏ ఒక్క పదవిని తీసుకోనని చెప్పి ఆచరించిన మహా నిష్టాగరిష్ఠుడు బాపూజీ. పేదలపై పెత్తందారి అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే కాకుండా ఏక కాలంలో ఆరు భిన్నమైన అంతర్గత సంబంధం కలిగి ఉన్న ప్రజా ఉద్యమాలతో ఆయన జీవితం ముడిపడి ఉన్నది. నిజాం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన తరగతుల ఉద్యమం, చేనేత సహకారోద్యమం, తెలంగాణ రైతాంగ పోరాటం, స్వాతంత్ర్యోద్యమం, ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలు చేసిన బహుముఖ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.

నియంతృత్వ భూస్వామ్య నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ఉద్యమంలో యువ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన బాపూజీ నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ ప్రతిఘటనోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. జాతీయోద్యమంలో సామాజిక మూలాలు వీడకుండా ప్రజా రాజకీయాలు చేసిన బాపూజీ చేనేత సహకారోద్యమంలో నేతన్నల హక్కుల సాధనకు శ్రమించారు. కార్యకర్తగా  స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర వహించిన బాపూజీ ఎంఎస్ రాయ్ ఆలోచనలు, రచనలకు, ప్రసంగాలకు ప్రభావితుడై ఆయన ప్రసంగాలను ‘భారత విప్లవ సమస్యలు’ అనే పేరుతో ఉర్దూలోకి అనువాదం చేసి ముద్రించారు. పల్లెలు, పట్టణాల్లోని మురికి వాడల్లో ఉండే పేదలు కుటీర పరిశ్రమల్లో, వంశపారంపర్యంగా వస్తున్న వృత్తులు చేసుకుని బతికే వారి జీవితాలను మార్చాలని అనుక్షణం తపించిన వ్యక్తి బాపూజీ. వడ్రంగి, కంసాలి, కంచర, మేధర, బెస్త, కల్లుగీత కార్మికుల, దర్జీల, వడ్డెరుల లాంటి ఉత్పత్తి కులాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేశారు. 

నేటి యువతకు ఆదర్శం

ఆసిఫాబాద్ తాలూకాలోని వాంకిడిలో కొండా పోశెట్టి, అమ్మక్కలకు 1915 సెప్టెంబర్ 27 న జన్మించిన బాపూజీ 97 సంవత్సరాలు జీవించి 2012, సెప్టెంబర్ 21 న తుదిశ్వాస విడిచారు. పీడిత ప్రజల విముక్తి కోసం బహుముఖ పోరాటం చేసిన బాపూజీ నేటి తరం యువతకు, బహుజనులు ఆదర్శం కావాలి. 75 ఏండ్ల తెలంగాణ ఉత్సవాల సందర్భంగా బాపూజీని ఏ పార్టీ పట్టించుకోకపోవడం బాధాకరమే గాక సబ్బండ బహుజన వర్గాలకు, తెలంగాణ సమరయోధులకు అవమానకరం. మొక్కుబడిగా జయంతి కార్యక్రమాలు చేసే పాలకులు చిత్తశుద్ధితో మహనీయులు కలలు కన్న తెలంగాణ కోసం కృషి చేయాలి. కొండా స్ఫూర్తితో బీసీల అభివృద్ధికి దోహదం చేసే బీసీకులాల జనగణన, చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు, మహిళా బిల్లులో బీసీలకు రిజర్వేషన్లు, క్రిమీలేయర్ తొలగింపు, రిజర్వేషన్లపై సీలింగ్ ఎత్తివేత కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. 

మూడు తరాల ఉద్యమాలకు సాక్షి

మూడు తరాల ఉద్యమానికి సాక్షిగా నిలిచిన బాపూజీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఉద్యమ రూపంలో ముందుకు వచ్చిన అన్ని సందర్భాల్లో క్రియాశీలక పాత్ర వహించారు. 1956 లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటును ప్రతిఘటించిన ఉద్యమంలో, 1960 దశాబ్దాల చివరి నాళ్లలో పెద్ద ఎత్తున తలెత్తిన ఉద్యమంలో 1995 లో ముందుకు వచ్చిన రెండో దశ తెలంగాణ ఉద్యమంలో, చివరి దశ తెలంగాణ  ఉద్యమంలో బాపూజీ పెద్ద దిక్కుగా ఉన్నారు.  తెలంగాణ ఉద్యమం ఓట్లు, సీట్లకు పరిమితమై రాజీ ధోరణితో నడుస్తూ, నిరాశ నిస్పృహలతో జనం ఈసురోమంటున్న దశలో ఆయన తెలంగాణ ప్రజల్లో భవిష్యత్ పై ఆశలను చిగురింపజేశారు. కొండా లక్ష్మణ్ ఆసిఫాబాద్ నుంచి1952 లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో 23 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా విశేష సేవలు అందించారు. 1969లో మొదలైన తొలి దశ తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి అండగా నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షపై అమితంగా ఆలోచించే బాపూజీ 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు తన ఇల్లునే పార్టీ కేంద్ర కార్యాలయానికి అందించిన సహృదయ సౌజన్య శీలి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఏక నాయకత్వం పనికిరాదని సమష్టి నాయకత్వం మాత్రమే ఆశయ సిద్ధికి దోహదం చేస్తుందని ఎలుగెత్తి చాటిన బాపూజీ.. విద్యార్థి, యువజనులను చైతన్యం చేసి 96 ఏండ్ల వయసులో సైతం తెలంగాణ కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి తెలంగాణ ఉద్యమంలో సామాజికతను జోడించారు. 

సాయిని నరేందర్, సోషల్​ ఎనలిస్ట్