
వరంగల్ లో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు మంత్రి కొండా సురేఖ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పని చేయడానికి అయినా అప్పటి మంత్రులు పైసలు తీసుకునేవారని తానంటే తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రుల పనితీరును ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేస్తే తమ ప్రభుత్వంలోని మంత్రులను అన్నట్లు తన ఖ్యలను తప్పుగా వక్రీకరించడం సహేతుకం కాదని చెప్పారు.
తమ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలన చేస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు తమ పెయిడ్ ఆర్టిస్టులతో సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు కొండా సురేఖ. అందులో భాగంగానే ఆ వీడియోలో నా వ్యాఖ్యల్ని ముందు వెనక కొంత తీసేసి, మిగతా కొంత పార్ట్ ను కావాలనే హైలైట్ చేయడం వెనుక ఉన్న కుట్ర ఇదే. నేను అన్నది కేవలం గత ప్రభుత్వంలో పైసలు తీసుకొని పనిచేసిన మంత్రులను మాత్రమే. కానీ నా వ్యాఖ్యలను పెయిడ్ సోషల్ మీడియా వాళ్ళు ఎడిటింగ్ చేసిన మార్ఫింగ్ వీడియో చేసి రెండు రోజులుగా సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారు. ఈ వీడియోను ఇలా సర్కులేట్ చేసి... మా కేబినెట్ సభ్యుల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరికాదు. మీ ఆశలు నెరవేరవు. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులంతా అద్భుతంగా పనిచేస్తున్నారు. మా ప్రభుత్వానికి పనిచేసుడు తెలుసు. పరిపాలన చేయడం మాకు తెలుసు. మీ బీఆర్ఎస్ వాళ్ళకి సోషల్ మీడియాలో దొంగ ప్రచారం, తప్పుడు ప్రచారం ఎలా చేయాలో మాత్రమే తెలుసన్నారు.
Also Read : సంతాపాలు కాదు, సవాళ్లు విసిరే స్థాయికి ఎదిగాం
ఇటువంటి దుష్ప్రచారాలు ఇంకొకసారి చేస్తే ఎంత మాత్రం సహించేదిలేదన్నారు కొండా సురేఖ. ఇలా చేసే ఏ ఒక్కరిని వదిలి పెట్టేది లేదు. అసలు మీ బీఆర్ఎస్ నేతల నిర్వాకం వల్లనే కదా మంత్రులకు డబ్బులు ఇస్తే తప్ప ఫైళ్లు క్లియర్ కావు అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. కానీ మా కాంగ్రెస్ మంత్రులు అలా కాదు. మీ బీఆర్ఎస్ హయాంలో పైసలిస్తేనే పనులు జరిగేవి. ఈ విషయం మీ హయంలో పని చేసిన మంత్రి నాయిని నరసింహారెడ్డి.. కేసీఆర్ మానస పుత్రిక ఆయన మిషన్ కాకతీయలో ఉన్న కమిషన్ బాగోతాన్ని కమిషన్ కాకతీయ అని సంబోధించి మీ అవినీతిని బయట పెట్టలేదా? ఇక దళిత బంధులో ప్రతి ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకుంటారని అప్పటి సీఎం కేసీఆర్ గారే మీ ఎమ్మెల్యేల గురించి చెప్పలేదా? ఊర్ల మీద పడి ప్రజల రక్తాన్ని పిలిచారు కాబట్టే ప్రజలు మీకు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. అయినా మీ బుద్ధి మారలేదు. ప్రతి అంశానికి వక్రభాష్యాలు చెబుతూ మీ వంకర బుద్ధిని బయట పెట్టుకుంటున్నారు. పద్ధతి మార్చుకోకపోతే అవినీతికి, అబద్ధాలకు పుట్టిన విష పురుగు బీఆర్ఎస్ ను ప్రజలే నామరూపాలు లేకుండా నలిపేస్తారని సురేఖ అన్నారు.