అడవుల శివార్లలో పల్లె పశువుల వనాలు: కొండా సురేఖ

అడవుల శివార్లలో పల్లె పశువుల వనాలు: కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు: పశువుల మేత కోసం ప్రత్యేకంగా పల్లె పశువుల వనాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అటవీ అధికారులను ఆ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. ఆవులు, బర్లు, మేకలు వంటి పెంపుడు జంతువులు అడవుల్లోకి వెళ్లకుండా, వాటి మేత కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. రాష్ట్రంలో అడవుల పెంపు, అటవీ భూముల రక్షణ, తదితర అంశాలపై సోమవారం అరణ్య భవన్​లో ఆమె అధికారులతో రివ్యూ చేశారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘కోతులు, ఎలుగుబంట్లు వంటి జంతువులు జనావాసాల్లోకి రాకుండా అడవుల్లో జామ, సీతాఫలం, రేగు, మామిడి వంటి పండ్లనిచ్చే మొక్కలు నాటాలి. అడవులపై ఆధారపడి బతికే గిరిజనులకు ఉపాధి లభించేలా చింత, మునగ వంటి మొక్కల పెంపకాలు చేపట్టాలి. గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి చేపట్టిన హరితహారం కార్యక్రమంతో ఆశించిన ఫలితాలు రాలేవు. ఇకపై హరితహారంలో స్థానిక జాతి మొక్కలనే నాటాలి. ఇందుకు అనుగుణంగా నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయాలి’’అని సూచించారు.

పులుల మరణం కలిచి వేసింది

ప్రతి అధికారి కుటుంబంతో సహా పనిచేసే ప్రదేశంలోనే నివాసం ఉండాలని మంత్రి సురేఖ సూచించారు. అడవుల రక్షణ బాధ్యతను అందరూ సమర్థవంతంగా నెరవేర్చాలన్నారు. ఇటీవల కాగజ్ నగర్ లో పులుల మరణం తనను కలిచివేసిందని, రానున్న రోజుల్లో ఇవి రిపీట్ కావొద్దని సూచించారు. ‘‘వరంగల్, హన్మకొండ, ఖాజీపేట నగరాల్లో పచ్చదనం పెంపు, పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తున్నాం. చట్ట వ్యతిరేకంగా అడవుల ఆక్రమణకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. గుత్తికోయ ప్రభావిత ప్రాంతాల్లో చట్టం పకడ్బందీగా అమలు చేస్తాం. కొత్తగా అటవీ స్టేషన్ల ఏర్పాటు, సిబ్బందికి ఆయుధాల విషయం ప్రభుత్వ పరిధిలో ఉంది. చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’అని అన్నారు. త్వరలో అటవీ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. స్మగ్లర్లపై కఠిన చర్యల కోసం పీడీ యాక్ట్ పెట్టేందుకు పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు. రివ్యూ మీటింగ్​లో ఫారెస్ట్ సెక్రటరీ వాణి ప్రసాద్, పీసీసీఎఫ్ ఆర్‌‌‌‌‌‌‌‌ఎం డోబ్రియాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆర్గానిక్ తేనెను ఆవిష్కరించిన మంత్రి

ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూషన్​ (ఎఫ్​సీఆర్​ఐ) ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రంలో తయారు చేసిన ఆర్గానిక్ (సేంద్రియ) తేనెను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తేనెటీగల పెంపకం, ఆదాయ అభివృద్ధిపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ములుగులో ఉన్న ఫారెస్ట్ కాలేజీలో ప్రత్యేకంగా తేనెటీగల పెంపకం, ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. ఈ సెంటర్ ఆధ్వర్యంలో పూర్తి సేంద్రియ పద్ధతుల్లో అభివృద్ధి చేసిన తేనెను “వైల్డ్ ఫ్లేవర్స్” బ్రాండ్ పేరుతో అందుబాటులోకి తెస్తున్నారు.