ఫోన్‍ ట్యాపింగ్‍ కేసులో కేటీఆర్‍ జైలుకు వెళ్లడం ఖాయం: కొండా సురేఖ

ఫోన్‍ ట్యాపింగ్‍ కేసులో కేటీఆర్‍ జైలుకు వెళ్లడం ఖాయం: కొండా సురేఖ
  •     ఎంతోమంది హీరోయిన్లు, ఆఫీసర్లను బ్లాక్​మెయిల్​ చేసిండు
  •     అవినీతి కేసుల్లో కేసీఆర్‍ ఉన్నా  వదిలే ప్రసక్తి లేదు
  •     రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

వరంగల్‍/ఖిలా వరంగల్‍, వెలుగు : రాష్ట్రంలో ఫోన్‍ ట్యాపింగ్‍ కేసులో కేటీఆర్‍ త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్‍ తూర్పు నియోజకవర్గంలోని క్యాంప్‍ ఆఫీసులో ఆమె మాట్లాడుతూ కేటీఆర్‍కు పోయే కాలం దగ్గర పడిందని, ఫోన్‍ ట్యాపింగ్‍ కేసులో ఒక్కొక్కటిగా దందాలు బయటపడ్తున్నాయన్నారు. కవిత ఇప్పటికే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లిందని, కేటీఆర్‍ సైతం త్వరలోనే లోపలకు పోతాడన్నారు. కవిత లిక్కర్‍ స్కాంలో రూ.100 కోట్లు తీసుకుంటే..కేటీఆర్ ​ఫోన్‍ ట్యాపింగ్‍లతో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్‍ మెయిల్‍ చేశాడన్నారు. పలువురు అధికారులను బలిచేసి వారు ఉద్యోగాలు పోగొట్టుకునేందుకు కారణమై జైలుకు వెళ్లేలా చేశాడన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, అందులోని నేతలు చేసిన అవినీతి అక్రమాలు, భూకబ్జాలపై విచారణ జరిపిస్తామని, ఎవ్వరినీ వదిలే ప్రస్తక్తి లేదన్నారు. పదేండ్ల పాలనలో ఒక్కరోజు సెక్రటేరియట్​కు రాని కేసీఆర్‍కు..పార్లమెంట్‍ ఎన్నికలు వస్తున్నాయనగానే రైతులు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‍ ప్రభుత్వం వచ్చాక ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కూడా కేసీఆర్‍ అసెంబ్లీకి రాలేదన్నారు. రాష్ట్రంలో  రైతులు చనిపోతే 
పరామర్శకు రాకుండా వేరే రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రైతులకు చెక్కులు అందించిన సంగతి అందరికీ తెలుసన్నారు. 

కాంగ్రెస్‍ హయాంలో నిర్మించిన నాగార్జునసాగర్‍, శ్రీశైలం ప్రాజెక్టులు చెక్కు చెదరలేదని, కానీ, పర్సంటేజీలు తీసుకుని క్వాలిటీతో కట్టకపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆగమైందన్నారు. నిర్వహణ బాధ్యత లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగినట్లు నేషనల్‍ డ్యామ్‍ సేఫ్టీ అథారిటీ వాళ్లు చెప్పారన్నారు. అది పనికిరాదని నిపుణులు చెబుతున్న క్రమంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కేసీఆర్‍ బీఆర్‍ఎస్‍ ఆఫీస్‍లో పెట్టిన ప్రెస్‍మీట్ లో సాంకేతిక కారణాలవల్ల కరెంట్‍ పోతే రాష్ట్రం మొత్తం పోయినట్లు అబద్దపు ప్రచారం చేస్తున్నారని సీరియస్‍ అయ్యారు. టీఎస్ఎస్​పీడీసీఎల్​మాజీ సీఎండీ ప్రభాకర్‍రావు కేసీఆర్‍ బంధువని.. శ్రీశైలం ప్రమాదానికి అతనే కారణమన్నారు. రైతుల బాధలు తమకు తెలుసని, గతంలో రైతులను హామీలతో మోసం చేసిన వారు నష్టపరిహారం ఎంతివ్వాలో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఎంపీ ఎలక్షన్లలోనూ బీఆర్‍ఎస్‍  ఓడిపోతుందన్నారు.