న్యాయం జరిగేదాకా దీక్ష విరమించను : నర్సారెడ్డి

న్యాయం జరిగేదాకా దీక్ష విరమించను : నర్సారెడ్డి

సిద్దిపేట/సికింద్రాబాద్​, వెలుగు: కొండపోచమ్మ సాగర్‌‌‌‌ భూనిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. మూడురోజుల క్రితం గజ్వేల్​లోని  తన నివాసం వద్ద ఆయన దీక్షకు దిగగా మంగళవారం  రాత్రి పోలీసులు బలవంతంగా సికింద్రాబాద్​లోని యశోదా హాస్పిటల్​కు తరలించారు. హాస్పిటల్​లోనే నర్సారెడ్డి దీక్షను కొనసాగిస్తున్నారు. అక్కడ దీక్షను విరమింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో పోలీసులకు, నర్సారెడ్డి కుటుంబ సభ్యులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో నర్సారెడ్డి కూతురు అంక్షారెడ్డి చేయి విరిగింది. ఆయన సోదరితోపాటు పలువురు కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి. అదే హాస్పిటల్​లోనే అంక్షారెడ్డి చికిత్సపొందుతున్నారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగేవరకు దీక్షను విరమించబోనని నర్సారెడ్డి ‘వెలుగు’తో  ఫోన్‌‌‌‌లో అన్నారు.

సంతోష్​కు భూమి ఎలా కేటాయిస్తారు: రేవంత్

కొండపోచమ్మ సాగర్​ భూనిర్వాసితులకు న్యాయం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ రేవంత్​రెడ్డి మండిపడ్డారు. యశోదా హాస్పిటల్​లో బుధవారం నర్సారెడ్డిని ఆయన పరామర్శించారు. పోలీసుల తీరు వల్లే నర్సారెడ్డి కూతురుకు, బంధువులకు గాయాలయ్యాయన్నారు. భూ నిర్వాసితులకు న్యాయంచేయని కేసీఆర్​.. సడ్డకుని కొడుకు, ఎంపీ సంతోష్ కు 250 గజాల పట్టా భూమిని ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు.