ఖర్చు కొండంత.. ఫాయిదా గోరంత! కొండపోచమ్మ సాగర్​కు రూ.2,500 కోట్లకు పైగా ఖర్చు

ఖర్చు కొండంత.. ఫాయిదా గోరంత! కొండపోచమ్మ సాగర్​కు రూ.2,500 కోట్లకు పైగా ఖర్చు
  • 16,610 ఎకరాల ఆయకట్టుకే సాగునీరు
  • గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాకంతో నాలుగేండ్లుగా కాల్వల పనులు పెండింగ్
  • భూసేకరణపై దృష్టిపెట్టకపోవడంతోనే ఈ దుస్థితి
  • 4,595 ఎకరాల భూసేకరణ, కాల్వల నిర్మాణానికి మరో రూ.1,500 కోట్లు అవసరం
  • రిజర్వాయర్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు
  • అంచనా వ్యయాన్ని రూ.1,300 కోట్ల నుంచి రూ.2,800 కోట్లకు పెంచడంపై అనుమానాలు
  • ఇప్పటికే రంగంలోకి విజిలెన్స్ డిపార్ట్​మెంట్.. అన్ని లెక్కలు తీస్తున్న అధికారులు

హైదరాబాద్​, వెలుగు: కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్​ కోసం  గత బీఆర్​ఎస్​ సర్కార్​ వందలాది కోట్లు ఖర్చు పెట్టినా  ఆశించిన ఫలితం దక్కడం లేదు. కొండపోచమ్మ సాగర్ తో కేసీఆర్.. తన ఫామ్​హౌస్​కు నీళ్లు మళ్లించుకుపోయారే తప్ప, రైతులకు మాత్రం నీళ్లివ్వలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ రిజర్వాయర్​ కోసం దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే.. 20 వేల ఎకరాలకు కూడా నీళ్లు అందడం లేదు. 2020 మేలో ప్రారంభించిన ఈ రిజర్వాయర్​ కింద 10 కాల్వలతో దాదాపు 2.18 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలనుకున్నారు. 

కానీ నాలుగేండ్లవుతున్నా కాల్వల పనులు చాలా వరకు పెండింగ్​లోనే పడిపోయాయి. డిస్ట్రిబ్యూటరీల వ్యవస్థలో మైనర్లు, సబ్​మైనర్ల పనులు అసలు మొదలే కాలేదు. అందుకు అవసరమైన భూసేకరణను కూడా గత సర్కారు  పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే రూ.2,500 కోట్లు ఖర్చు పెట్టగా, మరో రూ.1,500 కోట్లు ఖర్చు పెడితేగానీ ఈ రిజర్వాయర్​తో రైతులకు ఫాయిదా ఉండదని అధికారులు చెబుతున్నారు. అందులో ఒక్క భూసేకరణకే రూ.వెయ్యి కోట్ల నిధులు అవసరమవుతాయని అంటున్నారు. ఆనాడు కొండపోచమ్మసాగర్​పై ఎన్నెన్నో చెప్పిన కేసీఆర్.. కనీసం భూసేకరణపైనా దృష్టిసారించలేదని, రిజర్వాయర్ నిర్వాసితులనూ బలవంతంగా ఆర్అండ్​ఆర్​కాలనీకి తరలించారన్న ఆరోపణలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలోనే చాలా మంది రైతులు అరకొర ప్యాకేజీకి భూములిచ్చేందుకు ఒప్పుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్​ నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదులతో విజిలెన్స్ డిపార్ట్​మెంట్​కూడా ఇప్పటికే రంగంలోకి దిగింది. ప్యాకేజీ 14లో భాగంగా నిర్మించిన ఈ రిజర్వాయర్​కు సంబంధించిన అంచనాలను రూ.1,300 కోట్ల నుంచి రూ.2,800 కోట్లకు అమాంతం పెంచడంపై అధికారుల నుంచి వివరణ కోరింది. 

ఇదీ నెట్​వర్క్.. ​

కొండపోచమ్మ సాగర్​ను గత బీఆర్ఎస్ సర్కార్ రూ.1,540 కోట్లతో నిర్మించింది. ఈ రిజర్వాయర్​కు మూడు చోట్ల పంప్​హౌస్​లను నిర్మించారు. ఆయా పంప్​హౌస్​ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు 10 కాల్వల నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఇప్పటిదాకా రూ.2,500 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు. జగ్​దేవ్​పూర్ కెనాల్, తుర్కపల్లి కెనాల్, ఎం.తుర్కపల్లి, గజ్వేల్, రామాయంపేట, శంకరంపేట, కిష్టాపూర్​కెనాల్, ఉప్పరపల్లి కెనాల్, సంగారెడ్డి కెనాల్​రీచ్ 1, సంగారెడ్డి కెనాల్ రీచ్​ 2ను నిర్మించాలనుకున్నారు. వీటి ద్వారా 2,18,112 ఎకరాలకు నీళ్లివ్వాలని టార్గెట్​ పెట్టుకున్నారు. ఇందులో సంగారెడ్డి కెనాల్స్​రీచ్​1, రీచ్​2లతో హల్ది వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టును నింపాలనుకున్నారు. ఈ రెండు కెనాల్స్​తో 51,417 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని భావించారు. అయితే ఇప్పటిదాకా ఆ కాల్వల పనులు మొదలు కాలేదు. 

మిగతా 8 కెనాల్స్​ద్వారా 1,66,695 ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉంది. ఈ కాల్వల్లోనూ చాలా వరకు పనులు పెండింగ్ ఉన్నాయి. వాటికి సంబంధించిన మైనర్లు, సబ్​మైనర్ల పనులు మొదలే కాలేదు. ఈ కాల్వల ద్వారా ఇప్పటి వరకు కేవలం 16,610 ఎకరాలకే నీళ్లిచ్చారని అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది. మరో 1,50,085 ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉంది. ఒక్క జగదేవ్​పూర్​కెనాల్​ద్వారా మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న 12,800 ఎకరాల ఆయకట్టులో సగానికి మాత్రమే నీళ్లిస్తున్నారు. మూడు కాల్వల కింద వంద నుంచి 300 ఎకరాలకే నీళ్లిస్తున్నారు. మిగతా 4 కాల్వల కింద కనీసం ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదు. 

భూసేకరణ ఆలస్యం.. 

కొండపోచమ్మసాగర్​ నెట్​వర్క్​లోని పది కాల్వలు, మైనర్లు, సబ్​మైనర్ల నిర్మాణానికి భూసేకరణే ప్రధాన సమస్యగా మారిందని అధికారులు చెబుతున్నారు. నాలుగేండ్లుగా భూసేకరణ సమస్య తీరడం లేదంటున్నారు.  గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోకపోవడంతోనే పనులు పెండింగ్​ పడ్డాయంటున్నారు. కాల్వలు, మైనర్లు, సబ్​మైనర్ల పనులు పూర్తి కావాలంటే మరో 4,595 ఎకరాల భూమిని సేకరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. అత్యధికంగా సంగారెడ్డి రీచ్​ 1కు 1500 ఎకరాలు, రీచ్​2కు 900 ఎకరాలను సేకరించాల్సి ఉంది. 

ఈ రెండింటికి కలిపి భూసేకరణకు దాదాపు రూ.340 కోట్లు అవసరమవుతాయని అంటున్నారు. తుర్కపల్లి కెనాల్​కోసం 490 ఎకరాల కోసం రూ.100 కోట్లు, గజ్వేల్​కెనాల్​కోసం 270 ఎకరాలకు రూ.60 కోట్లు, శంకరంపేటకు 400 ఎకరాల కోసం రూ.70 కోట్లు, రామాయంపేట కెనాల్​కోసం 370 ఎకరాలకు రూ.36 కోట్లు, కిష్టాపూర్​కెనాల్​కోసం 200 ఎకరాలకు రూ.35 కోట్లు అవసరమవుతాయని చెబుతున్నారు. మొత్తంగా భూసేకరణకే రూ.వెయ్యి కోట్లు అవుతుందని, ఆ తర్వాత కెనాల్స్​పూర్తి చేయడానికి మరో రూ.500 కోట్లు అవుతుందని పేర్కొంటున్నారు. ఈ కెనాల్స్ పూర్తయితేనే మరో లక్షన్నర ఎకరాలకు నీళ్లివ్వగలుగుతామని స్పష్టం చేస్తున్నారు. 

బస్వాపూర్ ​సంగతి సరేసరి..

యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మించిన బస్వాపూర్​రిజర్వాయర్​పైనా గత సర్కార్ నిర్లక్ష్య వైఖరినే అవలంబించింది. 11.79 టీఎంసీల సామర్థ్యంతో తలపెట్టిన ఈ రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయి. కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలనూ నిర్మించారు. అయితే గత సర్కార్ ఒక గ్రామం, రెండు తండాల ప్రజలను పునరావాసం కింద తరలించాల్సి ఉన్నా తరలించలేదు. పరిహారం ఇవ్వాలని ఆ ఊళ్ల ప్రజలు డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. బీఎన్ తిమ్మాపూర్, లక్ష్మీనాయక్​ తండా, చోగుళా నాయక్​ తండాకు చెందిన ప్రజలకు పునరావాస ప్యాకేజీని చెల్లించి వేరే చోటుకు తరలించాల్సి ఉంది. 

మిగిలి ఉన్న పనులతో పాటు ఆయా గ్రామాల ప్రజలకు అందించాల్సిన పునరావాస ప్యాకేజీకి రూ.500 కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ రిజర్వాయర్ కింద 1.66 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఇటు కొండపోచమ్మసాగర్​కాల్వల పెండింగ్ పనులు, బస్వాపూర్ రిజర్వాయర్​ఆర్అండ్​ఆర్​ప్యాకేజీ చెల్లింపునకు అవసరమైన నిధులను ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారని తెలిసింది.