
- మొదట ఏడుగురు.. ఆ తర్వాత 13 మంది రిలీజ్
- తమ వాహనాల్లో తీసుకొచ్చిన రెడ్‌క్రాస్ కమిటీ
- స్పెషల్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ స్క్వాడ్‌కు అప్పగింత
- హోస్టేజ్ స్క్వేర్ దగ్గర భారీ స్క్రీన్లు పెట్టి ప్రత్యక్ష ప్రసారం
- కుటుంబ సభ్యులు, బంధువుల్లో వెల్లివిరిసిన సంతోషం
- బదులుగా 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను
- రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
టెల్అవీవ్: హమాస్ చెరలో బందీలుగా మారిన వారికి రెండేండ్ల తర్వాత విముక్తి లభించింది. సోమవారం ఇజ్రాయెల్‌కు చెందిన ఏడుగురు బందీలను రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ (ఐసీఆర్‌సీ) కి హమాస్ అప్పగించింది. అనంతరం కొద్ది సమయం తర్వాత మరో 13 మంది బందీలను విడిచిపెట్టింది. వీరందరినీ రెడ్‌క్రాస్ తన ప్రత్యేక వాహనాల్లో ఇజ్రాయెల్‌కు తరలించింది. వారిని స్పెషల్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ స్క్వాడ్‌కు అప్పగించింది.
ఆ స్క్వాడ్ వారిని దక్షిణ ఇజ్రాయెల్‌లోని మిలిటరీ బేస్‌కు తీసుకొచ్చింది. వారందరికీ శారీరక, మానసిక పరీక్షలు నిర్వహించి.. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. బందీలకు స్వాగతం పలుకుతూ ఇజ్రాయెల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు, ఆయన సతీమణి వీడియో సందేశం విడుదల చేశారు. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ వెల్లడించింది.
రెండేండ్ల తర్వాత బందీల విడుదలతో వారి కుటుంబసభ్యులు, శ్రేయాభిలాషుల్లో సంతోషం నెలకొంది. కాగా, హమాస్ వద్ద ఇంకా 28 మంది ఇజ్రాయెల్ పౌరుల డెడ్‌బాడీలు ఉన్నాయి. వీటిని కూడా త్వరలోనే అప్పగించనున్నట్టు ప్రకటించింది. దీనికి బదులుగా పాలస్తీనాకు చెందిన 2 వేల మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇందులో 250 మంది జీవిత ఖైదు పడిన వారు ఉన్నారు.
1200 మంది హత్య, 251 మంది కిడ్నాప్..
హమాస్ టెర్రరిస్టులు 2023 అక్టోబర్ 7న గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డారు. రాకెట్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో సుమారు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. 251 మందిని బందీలుగా గాజాకు తరలించారు.
దీనికి ప్రతీకారంగా హమాస్‌ను పూర్తిగా అంతమొందిస్తామని ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ప్రతిజ్ఞ చేసి, గాజాపై పెద్ద ఎత్తున ఎయిర్ స్ట్రైక్స్ మొదలెట్టారు. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఇప్పటి వరకు 67,800 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. దాదాపు 23 లక్షల మంది ప్రజలపై ఈ యుద్ధ ప్రభావం పడింది. దోహా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో 2023 నవంబర్ 24న ఇజ్రాయెల్–హమాస్ మధ్య 6 రోజుల సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరింది.
ఇందులో భాగంగా హమాస్ 80 మంది ఇజ్రాయెల్ పౌరులతో పాటు ఇతర దేశీయులను విడుదల చేయగా, ఇజ్రాయెల్ తమ జైళ్లలో ఉన్న 240 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే, 6 రోజుల తర్వాత యుద్ధం మళ్లీ తీవ్రమైంది. అప్పటినుంచీ మారణహోమం సాగుతూనే ఉన్నది. కాగా, ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక అమలుపై ఈజిప్టులో హమాస్–ఇజ్రాయెల్ మధ్య జరిపిన చర్చలు ఫలించాయి.
ఇందులో భాగంగానే హమాస్ బందీలను విడుదల చేసింది. శాంతి ప్రణాళిక రెండో దశలో భాగంగా ఇందులో హమాస్ ఆయుధాలను విడిచిపెట్టడం.. గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.
హోస్టేజ్ స్క్వేర్ దగ్గర ఉద్విగ్న వాతావరణం
రెండేండ్ల తర్వాత బందీలు విడుదల కావడంతో టెల్అవీవ్‌లో ఉదయం నుంచే ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది. వీరి విడుదల ప్రక్రియను హోస్టేజీ స్క్వేర్ వద్ద భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి లైవ్ టెలికాస్ట్ చేశారు. తమ వారి రాక కోసం కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాగా, సీజ్‌ఫైర్ ఒప్పందం జరిగిన నాటి నుంచి గాజాలో భవనాల శిథిలాల కింది 200 మృతదేహాలను వెలికితీసినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది.