గత ప్రభుత్వం చేసిందే.. ఈ ప్రభుత్వం చేసింది : కూనంనేని

 గత ప్రభుత్వం చేసిందే.. ఈ ప్రభుత్వం చేసింది : కూనంనేని
  • కేసీఆర్‌‌ లాభాల్లో కాకుండా నికర లాభాల్లో కార్మికులకు వాటా ఇచ్చిండు: కూనంనేని

హైదరాబాద్, వెలుగు: కార్మికులకు లాభాల్లో వాటా విషయంలో గత బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం ఏం చేసిందో, ఈ ప్రభుత్వం కూడా అదే చేసిందని సింగరేణి కాలరీస్‌‌ వర్కర్స్‌‌ యూనియన్‌‌ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు, అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్​తన హయాంలో లాభాల నుంచి కాకుండా నికర లాభాల నుంచి కార్మికులకు వాటాలను పంచారని చెప్పారు. ఇటీవల సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాపై ప్రభుత్వం నిర్ణయంపై సీపీఐ, ఏఐటీయూసీ బాధ్యత వహించాలని కేటీఆర్‌‌ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

హైదరాబాద్ మగ్ధూం భవన్​లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2023–24 సంవత్సరం పూర్తి లాభం రూ.4,701 కోట్లు కాగా, రూ.2,412 కోట్ల నికర లాభాల నుంచి 33 శాతం ఇచ్చారని, కేసీఆర్‌‌ సీఎంగా ఉన్న కాలం నుంచి ఇదే తంతు కొనసాగుతున్నదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి సంస్థకు వచ్చిన లాభాలను కార్మికులకు పూర్తిగా పంపిణీ చేసిందా? అని సీతారామయ్య ప్రశ్నించారు. ఒకవేళ పంచి ఉంటే తాము కూడా ప్రస్తుత లాభాలను పూర్తిగా కార్మికులకు పంపిణీ చేసే బాధ్యతను తీసుకుంటామన్నారు.