కోటక్​బ్యాంక్​ లాభం 24 శాతం అప్..రెండో క్వార్టర్​లో రూ. 3,191 కోట్లు

కోటక్​బ్యాంక్​ లాభం 24 శాతం అప్..రెండో క్వార్టర్​లో రూ. 3,191 కోట్లు

న్యూఢిల్లీ : కోటక్ మహీంద్రా బ్యాంక్​ స్టాండెలోన్​ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్​లో   వార్షికంగా 24 శాతం పెరిగి రూ.3,191 కోట్లకు చేరుకుంది. ప్రధాన ఆదాయంలో మెరుగుదల, మొండిబాకీలు తగ్గడం ఇందుకు కారణం.  ఈ బ్యాంకు గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్​లో రూ.2,581 కోట్ల నికర లాభాన్ని సాధించింది. మొత్తం ఆదాయం రూ. 9,925 కోట్ల నుంచి రూ. 13,507 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం ఏడాది క్రితం రూ.5,099 కోట్ల నుంచి 23 శాతం పెరిగి రూ.6,297 కోట్లకు చేరుకుంది. క్వార్టర్​లో దాని నికర వడ్డీ మార్జిన్  వార్షికంగా 5.17 శాతం నుంచి 5.22 శాతానికి పెరిగింది.

ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. గ్రాస్​ ఎన్​పీఏలు గ్రాస్​ అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌లలో 1.72 శాతానికి తగ్గాయి. ఇవి ఏడాది క్రితం 2.08 శాతంగా ఉండేవి. నికర ఎన్‌‌‌‌‌‌‌‌పీఏలు 0.55 శాతం నుంచి 0.37 శాతానికి తగ్గాయి. సెప్టెంబర్ 30, 2023 నాటికి బ్యాంక్ మూలధన సమృద్ధి నిష్పత్తి 21.7 శాతంగా ఉంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన, సెప్టెంబర్ క్వార్టర్​లో బ్యాంక్ నికర లాభం 24 శాతం పెరిగి రూ.4,461 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్​ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.21,560 కోట్లకు పెరిగింది. ఇది అంతకు ముందు ఏడాది క్వార్టర్​లో రూ.17,435 కోట్లుగా ఉంది.  

బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఎండీగా అశోక్ వాస్వానీ  

అశోక్ వాస్వానీని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్,  సీఈఓగా నియమించాలన్న ప్రపోజల్​ను  ఆర్​బీఐ  ఆమోదించిందని కోటక్ మహీంద్రా బ్యాంక్ శనివారం తెలిపింది.   మూడు సంవత్సరాలపాటు ఆయన ఈ బాధ్యతల్లో ఉంటారు.   ఇటీవలి కాలం వరకు బార్‌‌‌‌‌‌‌‌క్లేస్‌‌‌‌‌‌‌‌లో పనిచేసిన వాస్వానీ, సెప్టెంబర్ ఒకటిన బ్యాంక్ ఎండీగా వైదొలిగిన ఉదయ్ కోటక్ వారసుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం, వాస్వానీ పగయా టెక్నాలజీస్ లిమిటెడ్ - ప్రెసిడెంట్​గా పనిచేస్తున్నారు.

ఆయన లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్, ఎస్​పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ బోర్డులో కూడా ఉన్నారు.  ప్రథమ్  లెండ్-ఎహ్యాండ్‌‌‌‌‌‌‌‌తో సహా పలు స్వచ్ఛంద సంస్థలకు మద్దతు ఇస్తున్నారు.  కోటక్​ మహీంద్రా  బ్యాంక్ వ్యవస్థాపక డైరెక్టర్ ఉదయ్ కోటక్ మాట్లాడుతూ అశోక్ వర్డ్ క్లాస్ లీడర్  అని, డిజిటల్  కస్టమర్ ఫోకస్ ఉన్న బ్యాంకర్ అని అన్నారు.  

ఐసీఐసీఐ బ్యాంక్ లాభం రూ. 10,261 కోట్లు

ఐసీఐసీఐ బ్యాంక్ స్టాండ్‌‌‌‌‌‌‌‌లోన్ నికర లాభం సెప్టెంబర్​తో ముగిసిన రెండో క్వార్టర్​లో 36 శాతం పెరిగి రూ.10,261 కోట్లకు చేరుకుంది. వడ్డీ ఆదాయంలో మెరుగుదల వల్ల లాభం వార్షికంగా 36 శాతం పెరిగింది.  ఈ బ్యాంకు గత ఏడాది కాలంలో రూ.7,558 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్​లో మొత్తం ఆదాయం రూ.31,088 కోట్ల నుంచి రూ.40,697 కోట్లకు పెరిగింది.  వడ్డీ ఆదాయం రూ.26,033 కోట్ల నుంచి రూ.34,920 కోట్లకు ఎగిసింది. నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 24 శాతం పెరిగి క్వార్టర్​లో రూ.18,308 కోట్లకు చేరుకుంది, క్రితం ఏడాది ఇదే క్వార్టర్​లో రూ.14,787 కోట్లుగా ఉంది.  

నికర వడ్డీ మార్జిన్ ఏడాది క్రితం ఇదే కాలంలో 4.31 శాతంతో పోలిస్తే 4.53 శాతానికి పెరిగింది. గ్రాస్ ఎన్​పీఏలు  2.76 శాతం నుంచి  2.48 శాతానికి తగ్గాయి. నికర మొండి బకాయిలు 0.61 శాతం నుంచి 0.43 శాతానికి తగ్గాయి.  మూలధన సమృద్ధి నిష్పత్తి    16.93 శాతం నుంచి 16 శాతానికి తగ్గింది. కన్సాలిడేటెడ్​గా లాభం  రూ.8,007 కోట్ల నుంచి 36 శాతం పెరిగి ఈసారి రూ.10,896 కోట్లకు చేరుకుంది.