
న్యూఢిల్లీ: ప్రైవేటురంగానికి చెందిన కోటక్మహీంద్రా బ్యాంక్ నికరలాభం (స్టాండెలోన్) 2026 ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో ఏడాది లెక్కన 7శాతం తగ్గి రూ. 3,282 కోట్లకు పడిపోయింది. గత సంవత్సరం రూ.3,520 కోట్లుగా ఉంది. ప్రొవిజన్లకు, కంటింజెన్సీలకు ఎక్కువ కేటాయింపులు చేయాల్సి రావడం లాభంపై ప్రభావం చూపింది.
అంతేగాక, గత ఏడాది జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో వాటాల విక్రయం ద్వారా వచ్చిన ఒక-సారి లాభాన్ని మినహాయించడం మరో కారణం. ఈ ఒక-సారి లాభాన్ని కలుపుకుంటే, సర్దుబాటు చేయని నికర లాభం రూ.6,250 కోట్లు అవుతుంది. ఈసారి బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) ఏడాది లెక్కన 6శాతం పెరిగి రూ. 7,259 కోట్లకు చేరుకుంది.
నికర వడ్డీ మార్జిన్ (ఎన్ఐఎం) 4.65శాతం వద్ద బలంగా ఉంది. ఖర్చు- ఆదాయ నిష్పత్తి 46.19శాతానికి పెరిగింది. ఈక్విటీపై రాబడి (ఆర్ఓఈ) 10.94శాతానికి తగ్గింది. ఇది గత సంవత్సరం జూన్ క్వార్టర్లో 13.91శాతం ఉంది. గ్రాస్ఎన్పీఏలు 1.39శాతం నుంచి 1.48శాతానికి చేరాయి. నెట్ఎన్పీఏలు 0.34శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. బ్యాంక్ కాసా డిపాజిట్ల నిష్పత్తి, గత సంవత్సరం 43.4శాతం నుంచి 40.9శాతానికి తగ్గింది.
గ్రూప్ లాభం రూ.4,472 కోట్లు
కోర్ బ్యాంకింగ్ కార్యకలాపాలలో సవాళ్లు ఉన్నప్పటికీ, కోటక్ మహీంద్రా గ్రూప్ ఈసారి రూ.4,472 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సాధించింది. బ్యాంక్ ఆపరేటింగ్ లాభం గత ఏడాదితో పోలిస్తే 6 శాతం పెరిగి రూ.5,564 కోట్లకు చేరుకుంది. ఈక్విటీపై రాబడి 11.13శాతంగా, ఆస్తులపై రాబడి (ఆర్ఓఏ) 2.03శాతంగా నమోదయింది. నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ ఏడాది లెక్కన 18శాతం పెరిగి రూ.7.5 లక్షల కోట్లకు చేరుకుంది.
కోటక్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నికరలాభం గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా 86శాతం పెరిగి రూ.326 కోట్లకు చేరుకుంది. కోటక్ సెక్యూరిటీస్ నికరలాభం 16శాతం పెరిగి రూ.465 కోట్లకు చేరుకుంది. కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ నికరలాభం 88శాతం పెరుగుదలతో రూ.327 కోట్లకు చేరుకుంది. బ్యాంకు నికర అడ్వాన్సుల విలువ 14శాతం పెరిగి రూ.4,44,823 కోట్లకు చేరుకుంది.