
భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తుమ్మలనగర్ కాలనీలో వారంతా 50 ఏండ్లుగా నివసిస్తున్నారు. ఆ స్థలాలన్నీ రైల్వే శాఖకు చెందినవని, ఆ స్థలాలను ఆక్రమించుకొని తుమ్మలనగర్ వాసులు ఇండ్లు నిర్మించుకున్నట్లుగా ఆ శాఖ ఆఫీసర్లు గుర్తించారు. వెంటనే ఖాళీ చేయాలని కాలనీ వాసులను ఆదేశించారు. గతేడాది పోలీసుల సహకారంతో ఇండ్లను కూల్చేశారు. ఏండ్లుగా నివాసముంటున్న తమను బజారున పడేశారని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఆ టైంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు డబుల్బెడ్రూం ఇండ్లు, జాగా లేని వారికి ఇంటిస్థలం ఇస్తామని అభయమిచ్చారు. దీంతో బాధితులు సంతోష పడ్డారు. అయితే నేటికీ ఆ సంతోషం వారికి దక్కలేదు. ఇండ్లు కోల్పోయి ఏడాది కావొస్తున్నా ఇండ్లు, స్థలాలు కేటాయించకపోవడంతో 135 కుటుంబాలు గోస పడుతున్నాయి.
అమలు కాని హామీలు
ఇండ్లను కూల్చి వేస్తే తన ప్రాణాలను అడ్డుపెట్టయినా అడ్డుకుంటానని చెప్పిన ఎమ్మెల్యే వనమా రైల్వే ఆఫీసర్లతో కొత్తగూడెం మున్సిపాలిటీ ఆఫీస్‌లో స్పెషల్ మీటింగ్ పెట్టి చర్చించినా ఫలితం లేకుండా పోయింది. పోలీస్ బందోబస్తు మధ్య జేసీబీలతో 50 ఏండ్లుగా ఉంటున్న ఇండ్లను కూల్చి వేశారు. కరెంట్ మీటర్లు ఉన్నా, మున్సిపాలిటీ నల్లా కనెక్షన్లు ఇచ్చినా పట్టించుకోలేదు. వీరిలో కొంతమందికి పట్టాలు కూడా వచ్చాయి. అయినా ఆక్రమణలంటూ రైల్వే శాఖ ఇండ్లను కూల్చేవేసింది. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే సీఎంతో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అక్టోబర్ 2 నాటికి పాత కొత్తగూడెంలో డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తానని బాధితులతో మీటింగ్ పెట్టి భరోసా కల్పించారు. ఆ తర్వాత డిసెంబర్ నాటికి కేటాయిస్తామని చెప్పారు. నెలలు గడుస్తున్నా ఇండ్ల జాడ లేదు. స్థలాలు కేటాయింపూ లేదు. బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పలుమార్లు గ్రీవెన్స్‌లో కలెక్టర్‌కు విన్నవించగా, న్యాయం చేస్తానని భరోసా కల్పించారు. కలెక్టర్, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు.
టీఆర్ఎస్ భవన్‌కు ఇచ్చినట్లే ఇయ్యాలె
న్యాయం చేస్తామని చెప్పిన ఎమ్మెల్యేతో పాటు ఆఫీసర్లు జాడ లేకుండా పోయారని తుమ్మలనగర్ బాధితులు వాపోతున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదని అంటున్నారు. టీఆర్ఎస్ భవన్ కోసం రూ.5 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.5 లక్షలకే ఇచ్చారని, అలాగే తమకు ల్యాండ్ ఇవ్వాలని కోరుతున్నారు. కలెక్టర్‌తో మాట్లాడి తమకు అదే రేటుకు ఇప్పించేలా ఎమ్మెల్యే చర్యలు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.