కొత్తగూడెంను వదిలి వెళ్లే ప్రసక్తే లేదు

కొత్తగూడెంను వదిలి వెళ్లే ప్రసక్తే లేదు
  • నేను రాజీనామా చేయడంలేదు
  • కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులు నాకే ఉన్నాయి
  • కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు

కొత్తగూడెం: తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంలేదని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. మునుగోడు తరహాలో వనమా వెంకటేశ్వర రావు కూడా రాజీనామా చేయబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తాను రాజీనామా చేస్తున్నట్లు కొంతమంది పనికట్టుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది మీడియా వ్యక్తులను అడ్డుపెట్టుకొని తనపై తప్పుడు రాతలు రాయిస్తున్నారన్న ఆయన... ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. 40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని, ఇలాంటి అసత్య ప్రచారాల వల్ల భయపడేదిలేదని చెప్పారు. కొత్తగూడెంను విడిచి వెళ్లేదిలేదని, వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తానని వనమా తెలిపారు.

కోర్టులో తనకు వ్యతిరేకంగా తీర్పు రాబోతుందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్న వనమా... తాను ఏ తప్పు చేయలేదని, కోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తన హయాంలో కొత్తగూడెం నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధి చేశానన్న వనమా... నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులు తనకు పుష్కలంగా ఉన్నాయన్న ఆయన... వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం నుంచే పోటీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు.