నాలుగేళ్లుగా న్యాయ పోరాటం.. పోరాడి గెలిచిన జలగం..

నాలుగేళ్లుగా న్యాయ పోరాటం..  పోరాడి గెలిచిన జలగం..

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఎట్టకేలకు జలగం వెంకట్రావ్​ గెలిచారు. ఎన్నికలు జరిగిన నాలుగున్నరేండ్ల తర్వాత భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వర్​రావు ఎన్నిక చెల్లదన్న హైకోర్టు, జలగం వెంకట్రావ్​నే ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ మంగళవారం తీర్పు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. హైకోర్టు తీర్పుతో వనమాపై న్యాయ పోరాటంలో గెలిచిన జలగం ఏకకాలంలో ఎమ్మెల్యేగానూ విజయం సాధించినట్లయింది. 2018లో వనమా వెంకటేశ్వర్​రావు ఈసీకి సమర్పించిన ఎలక్షన్ ​అఫిడవిట్​లో తప్పులను దొరకబట్టిన జలగం, నాలుగేండ్లుగా  న్యాయపోరాటం చేస్తున్నారు. తన ఆఫీస్​లో జలగం ఎదురుగా రెండు టేబుళ్లు ఉంటే అందులో ఒక టేబుల్​పై ప్రత్యేకంగా వనమా కేసు ఫైల్​పెట్టుకునేవారంటే ఆయన ఈ అంశాన్ని ఎంత సీరియస్​గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. హైకోర్టు తీర్పుతో కొత్తగూడెంలో జలగం అనుచరులు సంబరాలు జరుపుకోగా, సుప్రీం గడప తొక్కేందుకు వనామా సిద్ధమవుతుండడం ఆసక్తి రేపుతోంది. 

ప్రతి వాయిదాకు హాజరైన జలగం

2018 డిసెంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్​తరుపున బరిలో దిగిన వనమా వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్​ అభ్యర్థి జలగం వెంకట్రావ్​పై 4,139 ఓట్ల తేడాతో గెలుపొందారు. కానీ, ఎన్నికల సందర్భంగా వనమా ఈసీకి తప్పుడు అఫిడవిట్​సమర్పించారని, ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ ఆధారాలతో జలగం జనవరి 25, 2019న హైకోర్టును ఆశ్రయించారు. అఫిడవిట్​లో ఆస్తులు, పోలీస్​ కేసులకు సంబంధించిన వివరాలను తప్పుగా పేర్కొన్నారని కోర్టుకు విన్నవించారు. కేసు వేసినప్పటి నుంచి తీర్పు వచ్చే వరకు నాలుగైదు సార్లు తప్ప ప్రతి వాయిదాకు హాజరయ్యారు. సుమారు 60 నుంచి 70 సార్లు కోర్టుకు వెళ్లి వచ్చారు. కేసు విచారణలో జాప్యం జరుగుతుండడంతో జలగం గతేడాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 

ALSO READ:ఏడి చెత్త ఆడనే.. కార్మికుల సమ్మెతో పల్లె జనం తిప్పలు

దేశ ఉన్నత న్యాయస్థానం చొరవతో కేసు విచారణలో స్పీడ్ ​పెరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్​చేసింది. మంగళవారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. 2018 నుంచి ఎమ్మెల్యేగా వనమా అనర్హుడని, ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావ్​ను కొనసాగించాలని స్పష్టం చేసింది. అఫిడవిట్​లో వనమా చేసిన తప్పులను రుజువు చేయడానికి జలగం అన్ని ఆధారాలతో ప్రత్యేకంగా ఓ ఫైల్​ను రూపొందించుకున్నారు. పక్కా ప్లాన్​ ప్రకారం న్యాయపోరాటం చేయడం వల్లే జలగం గెలిచారని అనుచరులు చెప్తున్నారు.  

సంబురాలు..సానుభూతి..

కోర్టు తీర్పు తర్వాత కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లిలోని జలగం క్యాంప్​ ఆఫీస్​లో కార్యకర్తల సందడి పెరిగింది. అశ్వారావుపేట రింగ్ రోడ్డు సెంటర్​లో జలగం అభిమానులు పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు.  ఇదే టైంలో పాల్వంచలోని వనమా వెంకటేశ్వరరావు ఇంటికి కూడా నాయకులు, కార్యకర్తలు సానుభూతి తెలిపేందుకు తరలివచ్చారు. వనమాకు అనుకూలంగా నినాదాలు చేశారు. 

మొదటి నుంచీ పడ్తలే.. 

కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్​తరపున సిట్టింగ్​ఎమ్మెల్యేగా ఉన్న జలగం వెంకట్రావ్​2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ తరపున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. కొద్ది రోజుల తర్వాత వనమా  బీఆర్ఎస్​లో చేరారు. అప్పటి నుంచి ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. వనమా ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీలో జలగం వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో మొండిచేయి చూపడంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. పార్టీ కార్యక్రమాలకు కూడా జలగంతో పాటు ఆయన వర్గానికి చెందిన వారిని ఎమ్మెల్యే పిలువకపోవడంతో ఇద్దరి మధ్య సై అంటే సై అనే పరిస్థితి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​నుంచి తాను పోటీ చేస్తానంటే తాను పోటీ చేస్తానని ప్రకటించుకునేవారు. తాజాగా కోర్టు తీర్పుతో మాజీ ఎమ్మెల్యే జలగం ఎమ్మెల్యేగా మారగా, వనమా మాజీ ఎమ్మెల్యే అయ్యారు.  దీంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. 

సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం

అనర్హత విషయం తెలిసిన వెంటనే వనమా విచారంలో మునిగిపోయారు. ముఖ్య అనుచరులతో పాటు లాయర్లతో మంతనాలు సాగించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాగా, నాలుగైదు రోజులుగా వనమా హైదరాబాద్​లోనే మకాం వేశారు. మూడు రోజుల కింద సీఎంను కలిసి అభివృద్ధి పనులపై వినతిపత్రాలను ఇచ్చారు. కేసు తీర్పు వచ్చే అవకాశం ఉండడంతోనే అక్కడే ఉన్నారనే ప్రచారం సాగింది. వనమాతో సీఎం కేసీఆర్ ​ఫోన్​లో మాట్లాడారని, భయపడవద్దంటూ భరోసా ఇచ్చారని వనమా అనుచరులు చెబుతున్నారు.