నీటి ఆటల కోటిపల్లి

నీటి ఆటల కోటిపల్లి

కనుచూపు మేర పచ్చదనం, దారి పొడవునా ఎత్తైన కొండలు ఉన్న ప్లేస్​లంటే ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రాఫర్లకు చాలా ఇష్టం. అందుకే వీకెండ్​లో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపేందుకు చాలా మంది ఇలాంటి ప్లేస్​లకి వెళ్తుంటారు. టూరిస్ట్​లు మళ్లీ మళ్లీ చూసి రావాలి అనుకునే ప్లేస్​ల్లో కోటిపల్లి రిజర్వాయర్​ ఒకటి. వికారాబాద్​ జిల్లాలోని దారూర్​ ఊర్లో ఉంది.  ఇక్కడ ​వాటర్​ స్పోర్ట్స్ ఫేమస్.

ఒకప్పుడు ఇదొక మామూలు రిజర్వాయర్. టూరిస్ట్​ల్ని అట్రాక్ట్​ చేయడంతో పాటు అక్కడివాళ్ళకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో  ఇక్కడ 2015లో  వాటర్​ స్పోర్ట్స్​ (కాయకింగ్)  మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఈ ప్లేస్​ టూరిస్ట్​లకి బెస్ట్​ఛాయిస్​ అయింది. ​ఇక్కడ 30 నిమిషాలు కాయకింగ్​ చేయడానికి ఒక్కరికి  200, ఇద్దరికి రూ. 300 ఖర్చవుతుంది. లైఫ్​ జాకెట్స్​ ఇస్తారు. లైఫ్​గార్డ్స్​ కూడా వెంటే ఉంటారు. ఇక్కడి వాతావరణాన్ని ఎంజాయ్​ చేసేందుకు నేచర్​ లవర్స్​, ఫొటోగ్రాఫర్స్​ ఎక్కువగా వస్తుంటారు. అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్ చేసి, రిలాక్స్​ అయ్యేందుకు కోటిపల్లి రిజర్వాయర్​కి వెళ్తుంటారు చాలామంది. కోటిపల్లి దారి పొడవునా పక్షుల్ని చూస్తూ ఎంజాయ్​ చేయొచ్చు. వీకెండ్స్​లో ఈ ప్రాంతం టూరిస్ట్​లతో నిండిపోతుంది. ఫుడ్​, ఫ్రూట్​ స్టాల్స్​ కూడా ఉంటాయి ఇక్కడ.  

ఇలా వెళ్లాలి
అనంతగరి హిల్స్​ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది కోటిపల్లి రిజర్వాయర్. వికారాబాద్​ నుంచి 30 కిలోమీటర్లు, హైదరా బాద్​ నుంచి 110 కిలోమీటర్ల జర్నీ. కారు లేదా బైక్​ మీద వెళ్లొచ్చు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు పర్మిషన్​ ఉంటుంది. 

ట్రెక్కింగ్​కి పాపులర్​
వీకెండ్​లో లాంగ్​డ్రైవ్​కి వెళ్లాలి అనుకునేవాళ్లకి అనంతగిరి హిల్స్​ బెస్ట్​ ఛాయిస్​. తెలంగాణలో దట్టమైన అడవి ఉన్న ప్లేస్​ల్లో ఇదొకటి. మూసీ నది పుట్టింది ఇక్కడే. అంతేకాదు ఉస్మాన్​సాగర్, హియాయత్ సాగర్​ చెరువులకి  నీళ్లు వచ్చేది అనంతగిరి నుంచే. ఇక్కడికి వెళ్లే దారంతా...  ఎత్తైన కొండలు, పెద్దపెద్ద చెట్లు , మలుపుల రోడ్డుతో కొత్త ఫీలింగ్​ని ఇస్తుంది. వ్యూ పాయింట్స్​ నుంచి చూస్తే  అనంతగిరి మొత్తం కనిపిస్తుంది. వీకెండ్స్​లో చాలామంది ఇక్కడ ట్రెక్కింగ్​ చేస్తుంటారు. కొండ మీదనే అనంతగిరి టెంపుల్​ ఉంటుంది. శ్రీ మహా విష్ణువు అనంతపద్మనాభ స్వామిగా పూజలందుకుంటున్నాడు ఇక్కడ. రోజంతా  ఉండాలి అనుకునే వాళ్లు ఇక్కడి హరిత రిసార్టులో బస చేయొచ్చు. రోజుకి రూ.1500 కట్టాలి.   

ఇలా వెళ్లాలి
వికారాబాద్​ నుంచి ఆరున్నర కిలోమీటర్లు జర్నీ చేస్తే అనంతగిరి కొండల దగ్గరికి చేరుకోవచ్చు. హైదరాబాద్​ నుంచి 90  కిలోమీటర్లు జర్నీ.