
హైదరాబాద్: ఏపీ టీడీపీ ఎంపీ కొడుకునంటూ పరిచయం చేసుకొని మోసాలకు పాల్పడుతున్న విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. జేఎన్టీయూలోని సితార ఉమెన్స్ హాస్టల్లో తన జూనియర్స్ను జాయిన్ చేస్తానని హాస్టల్ నిర్వాహకురాలిని విక్రాంత్ రెడ్డి పరిచయం చేసుకున్నాడు. నాలుగు సార్లు సితార హాస్టల్కు వెళ్లిన విక్రాంత్, పలు మార్లు ఫుడ్ కూడా టేస్ట్ చేశాడు. తనకు జువెలరీ షోరూం ఉందని, మీరు ధరించిన బంగారు చైన్ ఇస్తే మరింత అందంగా డిజైన్ చేసిస్తానని సితార హాస్టల్ నిర్వాహకురాలిని విక్రాంత్ నమ్మించాడు.
విక్రాంత్ మాటలు నమ్మిన సదరు మహిళ తన మెడలో ఉన్న 4 తులాల గోల్డ్ చైన్ అతనికి ఇచ్చింది. మంచి మోడల్ డిజైన్ కావాలంటే మరింత గోల్డ్ అదనంగా జోడించాలని, దానికి లక్ష వరకు అవుతుందని సదరు మహిళకు విక్రాంత్ చెప్పాడు. అతని మాటలు నమ్మిన హాస్టల్ నిర్వాహకురాలు తన డబ్బులు ఫోన్ పే ద్వారా 55 వేలు, నెట్ క్యాష్ 45 వేలు ఇచ్చింది.
గోల్డ్ చైన్ కోసం తిరిగి విక్రాంత్కు ఫోన్ చేయగా ఎంతకూ కాల్ కలవకపోవడంతో అనుమానంతో కేపీహెచ్బీ పోలీసు స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేయగా.. విక్రాంత్ రెడ్డి అపోలో హాస్పిటల్లో న్యూరో సర్జన్గా విధులు నిర్వహిస్తున్నట్లు తేలింది. ఇతనిపై గతంలో ఏపీ, తెలంగాణలో 9 కేసులు నమోదైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. విశ్వసనీయ సమాచారం మేరకు విక్రాంత్ రెడ్డిని పోలీసులు జేఎన్టీయూలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.