కృష్ణా బోర్డు మెంబర్‌‌‌‌ రవికుమార్‌‌‌‌ పిళ్లై బదిలీ

కృష్ణా బోర్డు మెంబర్‌‌‌‌  రవికుమార్‌‌‌‌ పిళ్లై బదిలీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కృష్ణా రివర్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ బోర్డు (కేఆర్‌‌‌‌ఎంబీ) మెంబర్‌‌‌‌ రవికుమార్‌‌‌‌ పిళ్లైపై కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకుంది. ఢిల్లీలోని సీడబ్ల్యూసీ హెడ్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌కు ఆయనను బదిలీ చేసింది. ఆయనతో పాటు మరో అధికారి బదిలీకి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆమోదం తెలిపారని జలశక్తి మంత్రిత్వ శాఖ అండర్‌‌‌‌ సెక్రటరీ అనిల్‌‌‌‌ కుమార్‌‌‌‌ శర్మ ప్రకటించారు. సీడబ్ల్యూసీ హెడ్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌లో పనిచేస్తున్న టీడీ శర్మను సెంట్రల్‌‌‌‌ వాటర్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ అథారిటీ (సీడబ్ల్యూఎంఏ)కు బదిలీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. రవికుమార్‌‌‌‌ పిళ్లై స్థానంలో కేఆర్‌‌‌‌ఎంబీ సభ్యుడిగా ఇంకా ఎవరిని నియమించలేదు. రిజర్వాయర్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కమిటీ (ఆర్‌‌‌‌ఎంసీ) కన్వీనర్‌‌‌‌గా వ్యవహరించిన పిళ్లై తెలంగాణకు నష్టం చేసేలా ఆర్‌‌‌‌ఎంసీ రికమండేషన్స్‌‌‌‌ రూపొందించారు.

ఆర్ఎంసీలో తెలంగాణ నుంచి సభ్యులుగా ఉన్న అధికారులు మీటింగ్‌‌‌‌లో రికమండేషన్స్‌‌‌‌కు ఆమోదం తెలిపి సంతకాలు చేసేందుకు రాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఒప్పుకున్న అంశాలపై ప్రభుత్వాన్ని ఒప్పించలేరా.. వాళ్లది క్రమశిక్షణా రాహిత్యం అంటూ ఫైర్‌‌‌‌ అయ్యారు. ఈనెల మూడో తేదీన జరిగిన ఆర్‌‌‌‌ఎంసీ చివరి మీటింగ్‌‌‌‌లో శ్రీశైలం ప్రాజెక్టు ఆపరేషన్‌‌‌‌ ప్రొటోకాల్‌‌‌‌ (రూల్‌‌‌‌ కర్వ్స్‌‌‌‌), పవర్‌‌‌‌ జనరేషన్‌‌‌‌, సర్‌‌‌‌ప్లస్‌‌‌‌ డేస్‌‌‌‌లో ఉపయోగించుకున్న నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని పిళ్లై మీడియాకు వివరించారు. కేవలం ఆ రికమండేషన్స్‌‌‌‌పై సంతకాలు చేయడం కోసమే సోమవారం (ఐదో తేదీన) మళ్లీ సమావేశం ఉంటుందని తెలిపారు. సోమవారం నాటి మీటింగ్‌‌‌‌కు తెలంగాణ హాజరుకాలేదు. తాము ఆర్‌‌‌‌ఎంసీ రికమండేషన్స్‌‌‌‌ను ఒప్పుకోనే లేదని, కన్వీనర్‌‌‌‌గా ఉన్న పిళ్లై మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్‌‌‌‌ఎంసీ సమావేశాల్లో పిళ్లై వ్యవహారశైలి, సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన అంశాల ఆధారంగానే బదిలీ వేటు వేసినట్టు ప్రచారం జరుగుతోంది.