కృష్ణా బోర్డు పరిధి ఫైనల్‌‌!

కృష్ణా బోర్డు పరిధి ఫైనల్‌‌!
  • కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షాతో కేఆర్‌‌ఎంబీ చైర్మన్‌‌, మెంబర్‌‌ సెక్రటరీ భేటీ
  • ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్‌‌ సమస్యలపై చర్చ
  • జ్యూరిస్డిక్షన్‌‌ను నోటిఫై చేస్తూ త్వరలోనే కేంద్రం ఉత్తర్వులు

హైదరాబాద్‌‌, వెలుగు: కృష్ణా రివర్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ బోర్డు (కేఆర్‌‌ఎంబీ) పరిధి ఫైనల్‌‌ అయింది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌‌ జారీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. పరిధి నోటిఫై చేసిన తర్వాత తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, లిఫ్టులు, హెడ్‌‌ రెగ్యులేటర్లన్నీ బోర్డు అధీనంలోకి రానున్నాయి. మొదట కృష్ణా బోర్డు పరిధి నోటిఫై చేశాక గోదావరి బోర్డు పరిధిని నిర్ణయించొచ్చని తెలిసింది. దీనికి సంబంధించిన పనులు ఢిల్లీలో చకచకా జరిగిపోతున్నాయి. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌‌షాతో కేఆర్‌‌ఎంబీ చైర్మన్‌‌ పరమేశం, మెంబర్‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌పురే గురువారం భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం హోం, జలశక్తి మంత్రిత్వ శాఖల అధికారులతో వారు సమావేశమై దీనికి సంబంధించిన ప్రొటోకాల్‌‌పై చర్చించారు.

కొత్త ఏడాది ప్రారంభంలోనే ప్రకటిస్తారనుకున్నా..
కృష్ణా, గోదావరి బోర్డులకు పరిధి నోటిఫై చేసే అధికారం తమదేనని రెండో అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ మీటింగ్‌‌లో కేంద్రం స్పష్టతనిచ్చింది. ఏపీ రీ ఆర్గనైజేషన్‌‌ యాక్ట్‌‌ ప్రకారం బోర్డుల పరిధిని నిర్ణయించే ప్రక్రియను నిరుడు అక్టోబర్‌‌లోనే మొదలు పెట్టింది. జ్యూరిస్డిక్షన్‌‌పై డ్రాఫ్ట్‌‌ నోటిఫికేషన్‌‌ను కేఆర్‌‌ఎంబీ సిద్ధం చేసి అక్టోబర్‌‌ 9న కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించింది. కేంద్రం, సీడబ్ల్యూసీ సూచనలకు మేరకు అందులో కొంత సవరణలు చేసి నవంబర్‌‌ మూడో వారంలో ఫైనల్‌‌ నోటిఫికేషన్‌‌ కేంద్రానికి పంపింది. కొత్త ఏడాది ప్రారంభంలోనే బోర్డుల పరిధిని కేంద్రం నిర్ణయిస్తుందని చర్చ జరిగినా వాయిదా పడుతూ వస్తోంది.

డీపీఆర్‌‌లు ఇచ్చారా?
కృష్ణాపై కట్టిన శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులు. నీటి కేటాయింపులు, విడుదల, కోటాకు మించి వినియోగం, క్యారీ ఓవర్, పవర్‌‌ ప్రొడక్షన్‌‌పై రెండు రాష్ట్రాల మధ్య ఏటా వివాదాలు వస్తున్నాయి. వీటికి పుల్‌‌స్టాప్‌‌ పెట్టడానికి కృష్ణా బోర్డు పరిధిని ఫైనల్‌‌ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో బోర్డు చైర్మన్‌‌, మెంబర్‌‌ సెక్రటరీ తనతో సమావేశం కావాలని కేంద్ర హోం మంత్రి ఆదేశించారు. బుధవారమే ఢిల్లీ చేరుకున్న బోర్డు చైర్మన్‌‌ గురువారం కేంద్ర హోం మంత్రితో సమావేశమయ్యారు. డ్రాఫ్ట్‌‌ను పరిశీలించిన హోం మంత్రి అందులో ఏమైనా మార్పులు చేయాలా అని అడిగి తెలుసుకున్నారు. రెండు రాష్ట్రాలూ ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు, ఇతర పర్మిషన్‌‌ల వివరాలు ఇచ్చాయా అని అడిగారు.  

స్పెషల్‌‌ సీఎస్‌‌లతో వీడియో కాన్ఫరెన్స్‌‌
బోర్డు చైర్మన్‌‌, మెంబర్‌‌ సెక్రటరీతో ఢిల్లీలో సమావేశమైన సమయంలోనే ఏపీ, తెలంగాణ ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌లతో అమిత్‌‌ షా వీడియో కాన్ఫరెన్స్‌‌ నిర్వహించారు. మార్చి 31నే ఈ సమావేశం ఉంటుందని తొలుత సమాచారం ఇచ్చినా కొన్ని కారణాలతో వాయిదా వేశారు. తాజా సమావేశం వివరాలను బోర్డు చైర్మన్‌‌తో పాటు రెండు రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ అండర్‌‌ సెక్రటరీ లలిత టి. హీడో అందజేసి సమావేశంలో పాల్గొనాలన్నారు. మీటింగ్‌‌లో అమిత్‌‌ షా మాట్లాడుతూ.. రెండో అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రాజెక్టుల డీపీఆర్‌‌లు వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. కేంద్రం పరిష్కరించగల టెక్నికల్‌‌ అంశాలు ఏమేం ఉన్నాయి, వేటిని ట్రిబ్యునల్‌‌ పరిధిలో తేల్చాల్సి ఉంటుందో అడిగారు. కేంద్ర జలశక్తి శాఖతో మరోసారి సంప్రదించి పరిధి నోటిఫై చేస్తామన్నారు. వీలైనంత త్వరగా బోర్డు హెడ్‌‌ క్వార్టర్స్‌‌ను వైజాగ్‌‌కు షిఫ్ట్‌‌ చేయాలని ఆదేశించారు.