
- జూరాలకు భీమా, నారాయణపూర్ నుంచి భారీగా ఇన్‌ఫ్లో
- శ్రీశైలం ప్రాజెక్టుకు 4.96 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్
- నాగార్జునసాగర్‌కు అంతే మొత్తంలో వరద.. 5.73 లక్షల క్యూసెక్కులు విడుదల
- గోదావరి బేసిన్లోనూ క్రమంగా పెరుగుతున్న వరదలు
- శ్రీరాంసాగర్‌కు 37 వేల క్యూసెక్కుల వరద
- ఎల్లంపల్లికి 1.37 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఇరిగేషన్ శాఖ అప్రమత్తమైంది. ప్రాజెక్టుల వద్ద హైఅలర్ట్ ప్రకటించింది. కృష్ణా బేసిన్‌తో పాటు గోదావరి బేసిన్లోనూ భారీ వర్షాల ధాటికి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం రేవంత్, ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలర్ట్ చేశారు.
ప్రాజెక్టుల వద్ద ఏఈ స్థాయి నుంచి సీఈ స్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మీడియం, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన కట్టలు బ్రీచ్ అయ్యే పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు వరద మరింత పెరిగింది. దాదాపు 5 లక్షల క్యూసెక్కుల వరకు వరద ప్రవాహాలు నమోదవుతున్నాయి.
వచ్చిన వరదను వచ్చినట్టే అధికారులు దిగువకు వదులుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లి మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుండడంతో ఆయా ప్రాజెక్టుల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. నెల కింద కురిసిన భారీ వర్షాలకు పెద్దవాగు ప్రాజెక్టు కట్ట కొట్టుకుపోయినందున మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కృష్ణా బేసిన్లో..
కృష్ణా ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. జూరాల నుంచి నాగార్జునసాగర్ వరకు భారీ వరద ప్రవాహాలు వస్తున్నాయి. జూరాలకు 3.76 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. అయితే, అందులో ఎగువన నారాయణపూర్ నుంచి వస్తున్న వరద కేవలం లక్ష క్యూసెక్కులేకాగా.. ఇటు లోకల్ క్యాచ్‌మెంట్‌తో పాటు భీమా నది నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోస్‌తో ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. భీమా నదికి వస్తున్న వరదలతో ఎగువన కర్ణాటకలోని సన్నతి బ్యారేజీ నుంచి దాదాపు 2 లక్షల క్యూసెక్కుల దాకా ఫ్లడ్‌ను దిగువకు రిలీజ్ చేస్తున్నారు.
దీంతో ఇటు నారాయణపూర్ అటు సన్నతి బ్యారేజీ నుంచి జూరాలకు వరద ప్రవాహం ఎక్కువగా నమోదవుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి వస్తున్న వరదతో పాటు సుంకేశుల ప్రాజెక్టు నుంచి వస్తున్న ప్రవాహంతో 4.96 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లోస్ నమోదవుతున్నాయి. అంతే మొత్తాన్ని దిగువన నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు రిలీజ్ చేస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్నుంచి 5.73 లక్షల క్యూసెక్కుల ఫ్లడ్‌ను వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి 6.25 లక్షల క్యూసెక్కుల వరదను ప్రకాశం బ్యారేజీలోకి వదులుతున్నారు.
ఇటు కృష్ణా ఫ్లడ్‌తో పాటు మున్నేరువాగు నుంచి వస్తున్న ఉధృత వరదతో ప్రకాశం బ్యారేజీ దగ్గర కూడా కృష్ణా నది ఉరకలెత్తుతున్నది. 15 అడుగుల వద్ద నది ప్రవహిస్తున్నది. బ్యారేజీ 70 గేట్లను ఎత్తేసి 9 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. అక్కడ ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కాగా, స్థానికంగా కురుస్తున్న వర్షాలతో ఇటు డిండి, లంకసాగర్, మూసీ ప్రాజెక్టులకు వరద పెరుగుతున్నది. డిండి ప్రాజెక్టుకు 19 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. లంక సాగర్ ప్రాజెక్టుకు 17 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది.
గోదావరి బేసిన్లో..
గోదావరి బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులతో పాటు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులైన కడెం, తాలిపేరు, కిన్నెరసాని, పెద్దవాగు, మత్తడివాగు, పోచారం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 37,165 క్యూసెక్కుల వరద వస్తున్నది. కడెం ప్రాజెక్టుకు 32 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1.37 లక్షల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 1.45 లక్షల క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులకు భారీ వరద నమోదవుతున్నది. తాలిపేరుకు 44,400 క్యూసెక్కులు, కిన్నెరసానికి 28 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదవుతున్నది.
వరద నీటిని వాడుకోండి: సీఎం
భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్ అవసరాల కోసం వాడుకునేలా వినియోగించుకోవాల్సిందిగా ఇరిగేషన్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ఇరిగేషన్ అధికారులతో సమీక్ష చేశారు. భారీ వర్షాలతో వచ్చిన వరదను రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నింపి నీటిని నిల్వ చేయాలని అధికారులకు సూచించారు. ‘‘ఎగువన కురిసిన వర్షాలతో పాటు కడెం నుంచి వస్తున్న వరదతో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది.
ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్ చేయండి. రోజుకు ఒక టీఎంసీ తగ్గకుండా డ్రా చేయండి. నంది, గాయత్రి పంప్ హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లను నింపండి. మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ వరకు జలాశయాల్లోకి నీటిని లిఫ్ట్ చేయండి’’ అని సీఎం రేవంత్ ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లకు లిఫ్ట్ చేసిన నీటితో సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులను నింపాల్సిందిగా ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘‘ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 18.45 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
కడెం ప్రాజెక్టు నుంచి ప్రవాహం ఉధృతంగా వస్తుండటంతో నంది, గాయత్రి పంప్ హౌస్ ల ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నారు. మిడ్‌మానేరులో 27 టీఎంసీలకుగానూ 15 టీఎంసీల నిల్వ ఉంది. అక్కడి నుంచి 14 వేల క్యూసెక్కులకు పైగా లోయర్ మానేరు డ్యామ్‌కు, మరో 6400 క్యూసెక్కులు అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా రంగనాయక్ సాగర్‌కు తరలిస్తున్నారు. రంగనాయకసాగర్ నుంచి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపండి. అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్ట్, నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరకు నీటిని తరలించండి. కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్‌కు నీటిని తరలించండి’’ అని ఆయన అధికారులకు సూచించారు.
గ్రౌండ్లో ఉండండి: మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలో అతిభారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏఈఈ స్థాయి నుంచి సీఈల వరకు అధికారులంతా గ్రౌండ్లో ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు. భారీ వరదల నేపథ్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేశారు. ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్ రావు, హరిరాం, డిప్యూటీ ఈఎన్సీ కె. శ్రీనివాస్‌లతో పాటు సీఈలు రివ్యూలో పాల్గొన్నారు.
చెరువులు డ్యామేజీ కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు. నిధుల గురించి ఆలోచించొద్దని, ప్రజాభద్రత కోసం నిరంతరం శ్రమిస్తుండాలని సూచించారు. డిండి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిందని నల్గొండ జిల్లా సీఈ అజయ్‌కుమార్ చెప్పగా.. ఉదయసముద్రం ప్రాజెక్టును నింపాల్సిందిగా మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పాలేరు రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండిందని, బ్యాక్ వాటర్‌తో ప్రాజెక్టు కెనాల్‌కు గండిపడిందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్ కు సాగర్ నీటిని నిలిపేసినట్టు చెప్పారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి, చింతలపాలెం, హుజూర్నగర్ మండలాల్లో దెబ్బతిన్న చెరువులకు మరమ్మతులు చేపట్టాలసిందిగా సూర్యాపేట సీఈ రమేశ్ బాబును మంత్రి ఆదేశించారు. వరంగల్ జిల్లా కే సముద్రం ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ను ఆనుకుని ఉన్న చెరువులు దెబ్బతిన్నాయని అధికారులు మంత్రికి వివరించగా తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలిచ్చారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రాంతాల్ల ఎప్పటికప్పుడు చెరువులు, కెనాల్స్, స్పిల్‌వేలను క్షుణ్నంగా పరిశీలించాలని సూచించారు.