రెండు రాష్ట్రాలు ప్రాజెక్టుల డీపీఆర్‌‌‌‌లు ఇవ్వాల్సిందే..

రెండు రాష్ట్రాలు ప్రాజెక్టుల డీపీఆర్‌‌‌‌లు ఇవ్వాల్సిందే..

హైదరాబాద్‌‌‌‌, వెలుగుఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌ విస్తరణ, సంగమేశ్వరం లిఫ్ట్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టులను ఆపాల్సిందేనని కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు(కేఆర్‌‌‌‌ఎంబీ) స్పష్టం చేసింది. బోర్డు టెక్నికల్‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌, అపెక్స్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ అనుమతి వచ్చేదాకా ఈ ప్రాజెక్టులను చేపట్టొద్దని, 203 జీవో పై ముందుకు వెళ్లొద్దని తేల్చిచెప్పింది. ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌‌‌‌లు వెంటనే సమర్పించాలని ఆదేశించగా.. తమ ప్రభుత్వ అనుమతి తీసుకొని డీపీఆర్‌‌‌‌లు ఇస్తామని ఏపీ అధికారులు పేర్కొన్నారు. 2020–21 వాటర్‌‌‌‌ ఇయర్‌‌‌‌లో కృష్ణా నీటిని ఏపీ, తెలంగాణలు 66:34 నిష్పత్తిలో, కరెంట్‌‌‌‌ను 50:50 నిష్పత్తిలో పంచుకునేందుకు అంగీకరించాయి.బోర్డు చైర్మన్‌ ఎ.పరమేశం అధ్యక్షతన గురువారం జలసౌధలోజరిగిన కేఆర్‌ఎంబీ 12వ మీటింగ్‌లో తెలంగాణ, ఏపీ ఇరిగేషన్‌ అధికారులు, ఈఎన్సీలు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

ఆరు గంటల పాటు మీటింగ్..

కేఆర్‌ఎంబీ చరిత్రలోనే 12వ మీటింగ్‌ సుదీర్ఘంగా ఆరు గంటల పాటు కొనసాగింది. ముందుగా తెలంగాణ ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రాజెక్టులపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు కొత్తవి కావని చెప్పారు. ఉమ్మడి ఏపీలో ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ప్రస్తుత ఏపీ జలవనరుల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాసే అప్పుడు జీవోలు ఇచ్చారని ఆ కాపీలను చూపించారు. ప్రాంతీయ అవసరాలకోసం ప్రాజెక్టులను రీ డిజైన్‌ చేసుకున్నామని, కొత్త రాష్ట్రం కాబట్టి ఏపీ జీవోలను ప్రస్తావించలేదని తెలిపారు. ఆర్డీఎస్‌ కేటాయింపుల మేరకు నీటిని వాడుకునేందుకే తుమ్మిళ్ల లిఫ్ట్​ను, సాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లిచ్చేందుకు భక్తరామదాసు లిఫ్ట్‌ ను ఏర్పాటు చేశామన్నారు. ఏపీనే అనుమతులు లేకుండా పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం లిఫ్టులను నిర్మిస్తోందని, వాటిని ఆపాలని రజత్​ కుమార్ కోరారు.

మోడీ వీడియో ప్రజెంటేషన్‌

2014 ఎన్నికలప్పుడు  మహబూబ్‌నగర్​ ప్రచార సభలో ఎన్‌డీఏ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను రజత్‌కుమార్‌ ప్రదర్శించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసుంటే పాలమూరు నుంచి వలసలే ఉండేవి కావని, ప్రభుత్వాల నిర్లక్ష్యంతోనే దానిని నిర్మించలేదని మోడీ అప్పట్లో విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఈ ప్రాజెక్టులు ఎంతటి నిర్లక్ష్యానికి గురయ్యాయో ప్రధాని కూడా గుర్తించారని చెప్పారు.

తెలంగాణ ప్రాజెక్టులన్నీ అక్రమమే

రాష్ట్ర విభజన తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఏపీ అధికారులు పాత పాటే పాడారు. ఏపీ వాదనలపై బోర్డు చైర్మన్‌ స్పందిస్తూ తెలంగాణ ప్రాజెక్టుల్లో చాలావరకు పనులు పూర్తి కావొచ్చాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రాజెక్టులను ఆపలేమని అన్నారు. కానీ ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లను కూడా బోర్డుకు ఇవ్వాలని ఆదేశించారు. దీనికి తెలంగాణ అధికారులు స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి డీపీఆర్‌లు అందజేస్తామని తెలిపారు. ఈ మీటింగ్‌లో ఏపీ ప్రస్తావించిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా నోట్‌ చేయాలని బోర్డు అధికారులను కోరారు.

పాత వాటాల ప్రకారమే నీళ్లు, కరెంట్‌

కృష్ణా కామన్‌ ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నీళ్లను గతంలో మాదిరిగానే 66:34 నిష్పత్తిలో పంచుకునేందుకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. మైనర్‌ ఇరిగేషన్‌ యుటిలైజేషన్‌, గోదావరి వాటర్‌ డైవర్షన్‌ వ్యవహారం తేలెంత వరకు ఈ నిష్పత్తినే కొనసాగించాలని బోర్డు సూచించింది. శ్రీశైలం కరెంట్‌ను తలా 50% చొప్పున తీసుకోవాలని నిర్ణయించాయి. రెండో దశ టెలిమెట్రీల ఏర్పాటుకు నిధులను ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు ఓకే చెప్పాయి. వరద నీటి వాటాలను అపెక్స్‌ కౌన్సిల్‌కు నివేదించి ఆ తర్వాత ప్రకటించాలని అంగీకారానికి వచ్చాయి. సాగర్‌ ఎడమ కాలువ లాసెస్‌పై స్టడీ చేయడానికి రెండు రాష్ట్రాల ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తాగునీటికి తీసుకుంటున్న నీటిలో 20 శాతమే యుటిలైజేషన్‌ కింద లెక్కించాలనే అంశాన్ని సీడబ్ల్యూసీకి నివేదిస్తామని, కేంద్రం ఆదేశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు ఏపీ ప్రభుత్వం గోదావరిని నీటిని తరలిస్తోందని, దీనికి బదులుగా ఎగువన కృష్ణాలో 45 టీఎంసీల నీళ్లు అడుగుతుందని, ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనకు పంపుతామని అన్నారు.

వరద నీళ్ల లెక్క చెప్పలే..

30 ఏళ్లలో కృష్ణా నదిలో వచ్చిన వరద లెక్కలు, అన్ని ప్రాజెక్టులు గేట్లు ఎత్తిన సమయంలో ఉపయోగించుకున్న నీటి లెక్కలను అడిగితే ఇప్పటి వరకు ఒక్క రాష్ట్రం కూడా జవాబివ్వలేదని కేఆర్‌‌ఎంబీ చైర్మన్‌‌ పరమేశం అన్నారు. మీటింగ్‌‌ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్లడ్‌‌ వాటర్‌‌పై ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే ఒకసారి వీడియో కాన్ఫరెన్స్‌‌లో మీటింగ్‌‌ పెట్టిందని, కమిటీ రిపోర్ట్‌‌ ఆధారంగా వరద నీటి వాటాలను తేల్చుతామని అన్నారు. కృష్ణా బోర్డు హెడ్​క్వార్టర్స్​ను ఏపీ సర్కారు ఎక్కడ ఏర్పాటు చేయమంటే అక్కడికి తరలిస్తామన్నారు.

తహసీల్దార్ల అధికారాల్లో కోత