సంగమేశ్వరం అక్రమాలను ఫోటోలతో బయటపెట్టిన కృష్ణా బోర్డు

సంగమేశ్వరం అక్రమాలను ఫోటోలతో బయటపెట్టిన కృష్ణా బోర్డు
  • 730 అడుగుల లోతు నుంచే నీటిని లిఫ్ట్​ చేసేందుకు పంపుహౌస్ తవ్వినట్లు బోర్డు వెల్లడి
  • ఎన్జీటీ తీర్పును ధిక్కరించినట్లు తేటతెల్లం
  • డీపీఆర్‌కు అవసరమైన దానికన్నా 
  • ఎక్కువే  పని చేశారని ఎన్జీటీకి నివేదిక

హైదరాబాద్‌‌, వెలుగు: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌  ప్రాజెక్టు పనులు చేయడం లేదంటూ ఇన్నాళ్లూ ఏపీ సర్కారు చెప్తున్నదంతా అబద్ధమని తేలిపోయింది. నేషనల్​ గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌
(ఎన్జీటీ) ఆదేశాలను ఉల్లంఘించినట్టు తేటతెల్లమైంది. డీపీఆర్‌‌ తయారీ కోసం సన్నాహక పనులు మాత్రమే చేస్తున్నామని ఎన్జీటీ ఎదుట బుకాయించిన ఏపీ అసలురంగు బయటపడింది. కృష్ణా బోర్డు ఎక్స్‌‌పర్ట్‌‌  టీం విజిట్‌‌లో నిజాలు వెలుగుచూశాయి. ప్రాజెక్టు డీపీఆర్‌‌ రూపొందించడానికి అవసరమైన దానికన్నా ఎక్కువే పనిచేశారని ఎక్స్‌‌పర్ట్‌‌ టీం తేల్చిచెప్పింది. 730 అడుగుల లోతు నుంచే నీటిని ఎత్తిపోసేందుకు పంపుహౌస్‌‌ తవ్వకం చేపట్టినట్లు, 5 మీటర్ల వ్యాసంతో 10 టన్నెల్స్‌‌ తవ్వినట్లు గుర్తించింది. శ్రీశైలం నీళ్లల్లో మునిగిపోయిన అప్రోచ్‌‌ చానల్‌‌ ఆనవాళ్లను.. పంపుహౌస్‌‌, ఫోర్‌‌బే, డెలివరీ సిస్టర్న్‌‌, అప్రోచ్‌‌ చానల్‌‌ కోసం చేపట్టిన భారీ తవ్వకాలను టీం బయటపెట్టింది. నివేదికను శనివారం ఎన్జీటీ చెన్నై బెంచ్‌‌కు అందజేసింది. దక్షిణ తెలంగాణను ఎండబెట్టే సంగమేశ్వరం ప్రాజెక్టు సంగతులన్నీ ఆ నివేదికలో తేటతెల్లమయ్యాయి. కేఆర్‌ఎంబీ మెంబర్‌ సెక్రటరీ డీఎం రాయ్‌పురే నేతృత్వంలో కేఆర్‌ఎంబీ మెంబర్‌ ఎల్‌బీ మౌన్‌తంగ్‌, సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ దర్పన్‌ తల్వార్‌ సభ్యులుగా ఉన్న ఎక్స్‌పర్ట్‌  టీం ఈ నెల 11న కర్నూల్‌ జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సమీపంలోని సంగమేశ్వరం పనులను పరిశీలించి రిపోర్టు తయారు చేసింది. 

ప్రాజెక్టు విజిట్​ను ఇన్నాళ్లూ అడ్డుకొని..!

అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం ప్రాజెక్టును చేపట్టేందుకు పూనుకోగా గతంలో నారాయణపేట జిల్లాకు చెందిన రైతు గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ కేసును విచారించిన ధర్మాసనం పర్యావరణ అనుమతులు సహా అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాతే పనులు మొదలు పెట్టాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఉల్లంఘించి ఏపీ అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టింది. ఏపీ పనులు చేస్తున్న విషయాన్ని ‘వెలుగు’ ఫొటోలతో సహా బయటపెట్టడంతో పిటిషనర్‌ గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీలో ఏపీపై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్‌  అయింది. పిటిషన్‌ను విచారించిన గ్రీన్‌ ట్రిబ్యునల్‌ పనులు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఈ ఏడాది ఫిబ్రవరి 24న కృష్ణా బోర్డు(కేఆర్​ఎంబీ)ను ఆదేశించింది. అప్పటి నుంచి పలుమార్లు ప్రాజెక్టును పరిశీలించడానికి కేఆర్‌ఎంబీ ప్రయత్నించినా ఏపీ సహకరించలేదు. వెళ్లి తీరాల్సిందేనని ఎన్జీటీ ఈ నెల 9న గట్టిగా చెప్పడంతో ఎక్స్‌పర్ట్‌ టీం ఈ నెల 11న ప్రాజెక్టు పనులను పరిశీలించి శనివారం రిపోర్టును  సమర్పించింది.

దక్షిణ తెలంగాణను ఎండబెట్టే సంగమేశ్వరం ప్రాజెక్టు సంగతులన్నీ ఆ నివేదికలో తేటతెల్లమయ్యాయి. కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌ సెక్రటరీ డీఎం రాయ్‌‌పురే నేతృత్వంలో కేఆర్‌‌ఎంబీ మెంబర్‌‌ (పవర్‌‌) ఎల్‌‌బీ మౌన్‌‌తంగ్‌‌, సీడబ్ల్యూసీ డైరెక్టర్‌‌ దర్పన్‌‌ తల్వార్‌‌ సభ్యులుగా ఉన్న ఎక్స్‌‌పర్ట్‌‌  టీం ఈ నెల 11న కర్నూల్‌‌ జిల్లాలోని పోతిరెడ్డిపాడు హెడ్‌‌ రెగ్యులేటర్‌‌ సమీపంలోని సంగమేశ్వరం పనులను పరిశీలించి రిపోర్టును తయారు చేసింది. 

రిపోర్టులో ఏముందంటే...

  • ఎక్స్‌పర్ట్‌ టీం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లే సరికి శ్రీశైలంలో 884.8 అడుగుల నీళ్లు నిల్వ ఉండటంతో సంగమేశ్వరం కోసం తవ్విన అప్రోచ్‌ చానల్‌ కనిపించలేదు. 8.89 కి.మీ.ల పొడవైన ఈ కాల్వలో 30 శాతమే తవ్వినట్టుగా ప్రాజెక్టు సీఈ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని రిపోర్ట్‌లో ఎక్స్​పర్ట్​ టీం ప్రస్తావించింది. అప్రోచ్‌ చానల్‌ నుంచి ఫోర్‌ బేకు నీళ్లు వచ్చే ముందు ప్రాంతంలో 15 మీటర్ల మేర కాల్వ తవ్వినట్లు ఆనవాళ్లను గుర్తించింది. దీనికి సంబంధించిన ఫొటో నివేదికలో ప్రచురించింది. 
  • ఫోర్‌ బే తవ్వకం పూర్తయింది. 237 మీటర్ల పొడువుతో లోతుగా తవ్వారు. ఫోర్‌ బేను మొదట 150 మీటర్ల నుంచి మొదలు పెట్టి పంపుహౌస్‌ వైపునకు  వెళ్లే సరికి 180 మీటర్ల లోతుతో తవ్వినట్టుగా టీం గుర్తించింది. ఇలా తవ్విని మట్టిని ట్రాన్స్‌పోర్ట్‌ చేయడానికి రెండు వైపులా ర్యాంపులు తవ్వినట్లు తేల్చింది.  ఇందుకు సంబంధించి రెండు ఫొటోలను నివేదికలో పొందుపరిచింది. 
  • 250 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పుతో పంపుహౌస్‌ తవ్వారు. 730 అడుగుల లోతులో నుంచి నీటిని ఎత్తిపోసేందుకు పంపుహౌస్‌  తవ్వకం చేపట్టారు. పంపుహౌస్‌ లోపలి నుంచి నీళ్లు ఎత్తిపోసేందుకు డెలివరీ మెయిన్స్‌ కోసం 10 టన్నెల్స్‌ తవ్వారు. అక్కడ మట్టి.. రాళ్లతో కూడుకుని ఉండటంతో ఈ టన్నెల్స్‌కు రాక్‌బోల్టింగ్‌ సపోర్ట్‌  సిస్టం ఏర్పాటు చేశారు. పంపుహౌస్‌  తవ్వకానికి సంబంధించిన రెండు ఫొటోలను రిపోర్టులో ఎక్స్​పర్ట్​ టీం  ప్రచురించింది. 
  • పంపుహౌస్‌  లోపల 5 మీటర్ల వ్యాసంతో కూడిన 10 టన్నెల్స్‌ తవ్వారు. ఒక్కో టన్నెల్‌ పొడవు 35 నుంచి 50 మీటర్ల వరకు ఉంది. (పంపుహౌస్‌లో ఏర్పాటు చేసే మోటార్లు ఈ టన్నెల్స్‌లో ఏర్పాటు చేసే డెలివరీ మెయిన్స్‌ ద్వారానే నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది.) దీనికి సంబంధించిన ఒక ఫొటోను నివేదికలో టీం జత చేసింది. 
  • పంపుహౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోసే డెలివరీ సిస్టర్న్‌కు ఎర్త్‌వర్క్‌ పూర్తి చేశారు. అక్కడి నుంచి శ్రీశైలం రైట్‌ మెయిన్‌ కెనాల్‌కు కలిపే 500 మీటర్ల పొడవైన లింక్‌ కెనాల్‌ తవ్వకం పూర్తి చేశారు. దీనికి సంబంధించి కూడా ఒక ఫొటోను టీం తన రిపోర్టులో పొందుపరిచింది.
  • పంపుహౌస్‌ నిర్మాణం ప్రాంతంలో రెండు బ్యాచింగ్‌ ప్లాంట్లతో పాటు పెద్ద ఎత్తున కంకర, రాక్‌ సాండ్‌, ఇతర పదార్థాలు నిల్వ చేశారు. దీనికి సంబంధించిన రెండు ఫొటోలను రిపోర్టులో ఎక్స్​పర్ట్​ టీం జత చేసింది.

ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ టీం నివేదికలోని ముఖ్యాంశాలు

  • 250 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పుతో పంపుహౌస్‌‌  తవ్వారు.
  • మొత్తం 10 టన్నెల్స్​ తవ్వగా.. అందులో ఒక్కో టన్నెల్‌‌ పొడవు 35 నుంచి 50 మీటర్ల వరకు ఉంది. 
  • 237 మీటర్ల పొడువుతో చాలా లోతుగా ఫోర్​ బే  తవ్వారు.
  • పంపుహౌస్‌‌ నుంచి నీటిని ఎత్తిపోసే డెలివరీ సిస్టర్న్‌‌కు సంబంధించిన ఎర్త్‌‌వర్క్‌‌ పూర్తి చేశారు. అక్కడి నుంచి శ్రీశైలం రైట్‌‌ మెయిన్‌‌ కెనాల్‌‌కు కలిపే 500 మీటర్ల పొడవైన లింక్‌‌  కెనాల్‌‌ తవ్వకం పూర్తి చేశారు. 

వెలుగు చెప్పిందే నిజమైంది

దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ, సంగమేశ్వరం ప్రాజెక్టుల కోసం ఏపీ వేస్తున్న ప్రతి అడుగునూ 2019 నవంబర్ నుంచే ‘వెలుగు’ బయట పెట్టింది. సర్వే మొదలు పెట్టిన విషయం సహా జీవో ఇవ్వడం.. టెండర్లు పిలవడం.. గుట్టు చప్పుడు కాకుండా పనులు ప్రారంభించడం... ఎన్జీటీ తీర్పుకే పాతర వేయడం.. ఇలా ఏపీ సర్కారు ప్రతి కదలికను పసిగట్టి ప్రజలకు తెలియజేసింది. ఈ అక్రమ ప్రాజెక్టుల గురించి ఫొటోలతో సహా వరుస కథనాలు అందించింది. అయినా కేసీఆర్​ సర్కారు పట్టించుకోలేదు. సంగమేశ్వరంను అపెక్స్ కౌన్సిల్​లో అడ్డుకునే చాన్స్ ఉన్నా, నిరుడు ఆగస్టు 5న కేంద్రం మీటింగ్ పెట్టినా వెళ్లలేదు. తన సన్నిహిత కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డికి టెండర్ కట్టబెట్టేందుకే ఈ మౌనమన్న విమర్శలు వచ్చాయి. మొన్నటికి మొన్న.. సంగమేశ్వరం పనుల పరిశీలనకు వెళ్లిన కృష్ణా బోర్డు టీం వెంట ఏపీ ఇంజనీర్లు ఉన్నారని ‘వెలుగు’ కథనం ప్రచురించింది.

రేపటి విచారణ కీలకం

సంగమేశ్వరం లిఫ్ట్‌‌ పనులపై సోమవారం ఎన్జీటీ చెన్నై బెంచ్‌‌ చేపట్టబోయే విచారణ కీలకంగా మారింది. ఎన్జీటీ ఆదేశాలను ఆంధ్రా సర్కారు పట్టించుకోకుండా ఈ ప్రాజెక్టును నిర్మిస్తోందని పిటిషనర్​ వాదిస్తున్నారు. తాము ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం లేదని కొన్ని రోజుల కిందటే ఏపీ సీఎస్‌‌ ఆదిత్యనాథ్ దాస్‌‌ ఎన్జీటీలో అఫిడవిట్‌‌ ఫైల్‌‌ చేశారు. అందులోనూ డీపీఆర్‌‌ కోసం సన్నాహకాలు మాత్రమే చేస్తున్నట్లు తెలిపారు. కేఆర్‌‌ఎంబీ టీం పరిశీలనలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఒక్క కాంక్రీట్‌‌ పనులు తప్ప ప్రాజెక్టుకు అవసమైన ఎర్త్‌‌ వర్క్‌‌ మొత్తం కంప్లీట్‌‌ చేశారు. తమ ఆదేశాలు ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేసినట్టు తేలితే ఆ రాష్ట్ర సీఎస్‌‌ను జైలుకు పంపుతామని గతంలో బెంచ్‌‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు సైట్​ విజిట్​లో కనిపించిన పనులు తీర్పును ఉల్లంఘించినట్టుగానే ఉండటంతో గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.