పరవళ్లు తొక్కుతూ.. ప్రాజెక్టులు నింపుతూ..

పరవళ్లు తొక్కుతూ..  ప్రాజెక్టులు నింపుతూ..

హైదరాబాద్‌, మహబూబ్‍నగర్‍, ఆత్మకూర్, నాగర్కర్నూల్, హాలియా, వెలుగుకృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదకు భీమా నది కూడా తోడవడంతో ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రెండు నదుల సంగమం వద్ద ప్రవాహం ఉధృతంగా సాగుతోంది. శనివారం ఉదయం కర్నాటకలోని నారాయణ్​పూర్‍ నుంచి6 లక్షల క్యూసెక్కుల ఔట్‍ఫ్లో, భీమా నది నుంచి 2.75 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో నమోదైంది. దీంతో జూరాల ప్రాజెక్టుకు 6 లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీరు వస్తోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 9.65 టీఎంసీలు కాగా.. 6.10 టీఎంసీల నీటి నిల్వను అధికారులు మెయింటైన్ చేస్తున్నారు. వచ్చిన నీరు వచ్చినట్లుగానే కిందికి వదులుతున్నారు. బ్యాక్‍వాటర్‍లో వరద ఎక్కడా ఆగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

జూరాలకు 6.10 లక్షల క్యూసెక్కులు

జూరాల ప్రాజెక్టుకు శనివారం 6.10 లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్‌‌ఫ్లో వచ్చింది. దీంతో ప్రాజెక్ట్​47 గేట్ల స్పిల్​వే  ద్వారా6.27 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు. వరద ఉధృతి పెరగడంతో ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వరదకు ఇప్పటికే దిగువ జూరాల విద్యుత్‍ కేంద్రంలోకి నీళ్లు వచ్చాయి. దీంతో అధికారులు విద్యుత్‍ ఉత్పత్తిని నిలిపివేశారు. ఎగువ జూరాల విద్యుత్‍ కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి తలెత్తితే విద్యుత్‍ ఉత్పత్తిని నిలివేస్తామని డిస్కం అధికారులు ప్రకటించారు. జూరాల ప్రధాన కుడి కాలువకు750 క్యూసెక్కులు, ఎడమకాలువకు750 క్యూసెక్కులు,  భీమా ఫేజ్–1 కాల్వకు1,300 క్యూసెక్కులు, భీమా ఫేజ్–2 కాల్వకు750 క్యూసెక్కులు, నెట్టెంపాడు కాలువకు2,250 క్యూసెక్కులు, కోయిల్‌‌సాగర్‌‌ కాల్వకు 315 క్యూసెక్కులు వదిలారు. ప్రాజెక్ట్​ నుంచి శుక్రవారం వివిధ సాగునీటి కాల్వలతోపాటు, శ్రీశైలం జలాశయానికి మొత్తం 6.3 లక్షల క్యూసెక్కులు విడుదల చేసినట్లు ప్రాజెక్ట్​ఈఈ శ్రీధర్​తెలిపారు.

శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత

ఎగువ నుంచి వచ్చిన వరదలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, శనివారం సాయంత్రానికి 204 టీఎంసీలకు చేరింది. 885 అడుగులకు గాను 883 అడుగులకు నిల్వ చేరింది. దీంతో 10 గేట్లు, కుడి, ఎడమ గట్టు విద్యుత్​ కేంద్రాల ద్వారా సుమారు 4 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్​లోకి వదులుతున్నారు. సాగర్​లోకి 5.34 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 527 అడుగులకు చేరింది. 312 టీఎంసీలకు గాను, 162 టీఎంసీలకు నిల్వ చేరుకుంది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రానికి సాగర్​నీటి మట్టం ఎనిమిది అడుగుల మేర పెరిగింది. 39,954 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.

తీర ప్రాంతాల ప్రజల తరలింపు

నారాయణపేట జిల్లాలోని కృష్ణా, మాగనూరు మండలాల్లో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. కర్నాటక సరిహద్దులోని వాసునగర్‍ (కృష్ణా మండలం)లోని ప్రజలను రెండు రోజుల క్రితమే అధికారులు ఖాళీ చేయించారు. వారికి కర్నాటకలోని శక్తినగర్‍లో పునరావసం కల్పించారు. శనివారం ఉదయం హిందూపూర్‍ గ్రామ శివారులోకి వరద ఒక్కసారిగా రావడంతో ఊరు జల దిగ్బంధమైంది. మరోవైపు కృష్ణా మండలం తంగిడి దగ్గర కృష్ణా, భీమా నదుల సంగమ ప్రాంతంలోని దత్త భీమా సంగమేశ్వర ఆలయంలో మహారాష్ట్రకు చెందిన పూజారులు చిక్కుకున్నారు. అంతకుముందు సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నా వారు పట్టించుకోలేదు. దేవుని సేవలోనే ఉంటామంటూ అక్కడే భీష్మించుకు కూర్చున్నారు. ఆలయంలో ప్రతిరోజు పూజలు చేయాలని, ఎంత వరద వచ్చినా తమకు ఏమీ కాదని మొండిపట్టుపట్టారు. ఈ క్రమంలో శనివారం వరద ఉధృతి పెరిగి ఫస్ట్ ఫ్లోర్ నీట మునిగింది. దీంతో అధికారులు వారికి నచ్చజెప్పి ఒడ్డుకు తరలించారు.

గంటగంటకు పెరుగుతున్న వరద

కృష్ణా నదికి వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతుండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మళ్లీ తాము చెప్పే వరకు తీర ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటికే నది తీరం వెంట గస్తీ బృందాలను నియమించారు. వీఆర్‍ఓలు, పంచాయతీ కార్యదర్శులతోపాటు ఆయా మండలాల తహసీల్దార్లకు సెలవులు రద్దు చేశారు. వరద ప్రవాహం తగ్గేవరకు సిబ్బంది అందుబాటులో ఉండాలని నారాయణపేట కలెక్టర్‍ వెంకట్‍రావు ఆదేశించారు. 2009 సెప్టెంబర్‍లో కృష్ణానదికి ఇదే స్థాయిలో వరదలు వచ్చాయి. తుంగభద్ర నది కూడా ఉప్పొంగడంతో ఉమ్మడి రాష్ట్రంలోని చాలా పట్టణాలు నీటమునిగాయి. ఈ క్రమంలో నాటి చేదు అనుభవాలను గుర్తించిన అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు ప్రారంభించడంతో ముప్పు తప్పింది.

నీట మునిగిన వేలాది ఎకరాలు

కృష్ణమ్మ ధాటికి నారాయణపేట జిల్లాలోని తీర ప్రాంతాలు విలవిలలాడుతున్నాయి. గురజాల, తంగిడి, కృష్ణా, వాసునగర్‍, ముడుమాల, మురార్‍దొడ్డి, కొల్పూర్‍, చిట్యాల, పస్సుల, పంచదేవ్‍పహడ్‍, దాదాన్‍పల్లి, అంకెన్‍పల్లి, అనుగొండ ప్రాంతాల్లో సాగు చేసిన వేలాది ఎకరాల వరి పంట నీటమునిగింది. కొన్నిచోట్ల పంట కొట్టుకుపోయింది. నీట మునిగిన పొలాలను మక్తల్‍ ఎమ్మెల్యే చిట్టెం రామ్మెహన్‍రెడ్డి పరిశీలించారు. వరద ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

నేడు సాగర్‌‌ ఆయకట్టుకు నీళ్లు

తెలంగాణ, ఏపీలోని నాగార్జున సాగర్‌‌ ఆయకట్టుకు నీళ్లు విడుదల చేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆదివారం విద్యా శాఖ మంత్రి జి.జగదీశ్‌‌రెడ్డి, ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనీల్‌‌ కుమార్‌‌ యాదవ్‌‌.. సాగర్‌‌ కుడి, ఎడమ కాలువ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత జగదీశ్‌‌రెడ్డి.. ఎల్‌‌ఎల్‌‌సీ, ఏఎంఆర్‌‌ కాలువల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను మంత్రి ఆహ్వానించారు.

మూడు రోజులు మోస్తరు వర్షాలు

వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈనెల12న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

 

సాగర్లో లాంచీల బంద్

నాగార్జున సాగర్​ప్రాజెక్టుకు వరద తాకిడి ఎక్కువగా ఉండటంతో నాగార్జునకొండకు వెళ్లే లాంచీలను పర్యాటక అధికారులు నిలిపేశారు. భారీగా వరద వస్తుండటంతోపాటు, బలంగా వీస్తున్న గాలుల కారణంగా లాంచీలను నడపడం మంచిది కాదని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.