కృష్ణమ్మకు పెరిగిన వరద..శ్రీశైలం వద్ద 4 గేట్లు ఓపెన్‌‌

కృష్ణమ్మకు పెరిగిన వరద..శ్రీశైలం వద్ద 4 గేట్లు ఓపెన్‌‌
  • జూరాల వద్ద 20 గేట్లు, శ్రీశైలం వద్ద నాలుగు గేట్లు ఓపెన్‌‌
  • నాగార్జునసాగర్‌‌కు 1.74 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో

గద్వాల, వెలుగు : కర్నాటకలో భారీ వర్షాలు పడుతుండడంతో కృష్ణా నదికి మళ్లీ వరద స్టార్ట్‌‌ అయింది. నారాయణపూర్‌‌ డ్యామ్‌‌ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో 17 గేట్లను ఓపెన్‌‌ చేసి 75,020 క్యూసెక్కుల నీటిని జూరాలకు వదులుతున్నారు. జూరాల వద్ద ఆరు టీఎంసీలను నిల్వ చేసి 20 గేట్ల ద్వారా 1,20,163 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాలకు 1.14 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తోంది.

శ్రీశైలం వద్ద 4 గేట్ల ద్వారా నీటి విడుదల

శ్రీశైలం, వెలుగు : శ్రీశైలం జలాశయానికి 1,90,828 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తోంది. దీంతో 4 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,79,971 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేస్తున్నారు. ప్రాజెక్ట్‌‌ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.70 అడుగుల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్‌‌ కేంద్రాల్లో విద్యుత్‌‌ ఉత్పత్తి కొనసాగుతోంది.

నాగార్జునసాగర్‌‌కు భారీ ఇన్‌‌ఫ్లో

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్‌‌ ప్రాజెక్ట్‌‌కు ఇన్‌‌ఫ్లో భారీ మొత్తంలో వస్తోంది. ఎగువ నుంచి 1,74,120 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 18 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,45,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల వరకు ప్రాజెక్ట్‌‌ నీటి మట్టం 590 అడుగులు (312.50 టీఎంసీలు)గా నమోదైంది. సాగర్‌‌ నుంచి కుడి కాల్వకు 4,940 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 6,173, విద్యుత్‌‌ ఉత్పత్తికి 29,597 క్యూసెక్కులు, ఎస్‌‌ఎల్‌‌బీసీకి 2,400, వరదకాల్వకు 400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.